బలవంతపు పరిష్కారం చేశారు
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:08 AM
అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో లాకౌట్‌లో ఉన్న జేఎస్ ఎల్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి బలవంతపు పరిష్కారం చేశారని కర్మాగారానికి చెందిన కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు లెంక శ్రీను ఆందోళన చేశారు.
జేఎస్‌ఎల్ పరిశ్రమ వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
కొత్తవలస, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో లాకౌట్‌లో ఉన్న జేఎస్ ఎల్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి బలవంతపు పరిష్కారం చేశారని కర్మాగారానికి చెందిన కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు లెంక శ్రీను ఆందోళన చేశారు. ఆయన గురువారం మరి కొంతమంది కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి కర్మాగారం వద్ద నిరసన చేశారు. నిమ్మలపాలెం గ్రామానికి చెందిన కె.వెంకటరమణ అనే కాంట్రాక్టు కార్మికుడు.. కొంతమంది కార్మికులతో కలసి లాకౌట్‌లో ఉన్న కర్మాగార యాజమాన్యాన్ని ఇటీవల కలిశాడు. తనకు రావలసిన సొమ్ము ఇస్తే తాను కంపెనీ నుంచి వైదొలుగుతానని చెప్పారు. సుమారు 15రోజుల కిందట యాజమాన్యం నుంచి సుమారు రూ.లక్షా 50వేల విలువ గల చెక్కు తీసుకుని, యాజమాన్యానికి స్వయంగా లేఖ రాసి ఇచ్చాడు. ఈ విషయం ఆయన తన భార్యకు తెలియజేశాడు. దీంతో ఆమె.. యాజమాన్యం అన్యాయంగా తక్కువ డబ్బులు ఇచ్చి, తన భర్త నుంచి లేఖ తీసుకుని పూర్తి పరిష్కారం చేశారంటూ యూనియన్ అధ్యక్షుడు లెంక శ్రీనును ఆశ్రయించింది. అలాగే గురువారం ఉదయం ఆమెతో పాటు కొంతమంది కార్మికులు కర్మాగారం వద్ద ఆందోళన చేశారు.
సుమారు 15 రోజుల కిందట వెంకటరమణ అనే కాంట్రాక్టు కార్మికుడు కొంతమంది కార్మికులతో కలిసి తమ వద్దకు వచ్చాడని జేఎస్‌ఎల్ ప్రతినిధి గోపాలకృష్ణ తెలిపారు. ఒక వేళ కర్మాగారం తెరచినా పని చేయలేనని, తనకు పూర్తి పరిష్కారం చేయాలని కోరాడన్నారు. సంతకాలు చేసిన తర్వాతే అతని సర్వీసు లెక్కగట్టి రావలసిన సొమ్మును చెక్కు రూపం అందజేశామని ఆయన తెలిపా రు. కార్మికుడి కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.