చినుకు రాలే.. చెరువు నిండలే!
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:35 PM
వర్షాకాలంలో చెరువులు నీటితో కళకళలాడుతుండాలి. వీటి ద్వారా పొలాలకు పుష్కలంగా సాగునీరు అందుతుండాలి.
- ఎల్‌నినోతో తీవ్ర వర్షాభావం
- జిల్లాలో 37.22 శాతం లోటు
- ఇప్పటి వరకు 45,056 హెక్టార్లలో సాగు
- వర్షాకాలంలో చెరువుల్లో ఉపాధి పనులు
- ప్రత్యామ్నాయ పంటలకు రైతులకు కొరవడిన అవగాహన
- శృంగవరపుకోట మండలం శివరామరాజుపేట శివారు బీకేఆర్‌పురం (బాలకృష్ణరాజపురం) గ్రామ పరిధిలోని బాపనయ్య చెరువు ఇది. ప్రతి ఏటా దాదాపు 40 ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెరువులో ఈ ఏడాది చుక్క నీరు లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ పథకం(వీబీజీ రామ్‌జీ) కింద ఈ చెరువులో వేతనదారులతో పనులు చేయిస్తున్నారు.
- అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలకు శృంగవరపుకోట మండలం కొత్తూరు- వెంకటరమణపేట-తిమిడి కూడలి మధ్య ఉన్న పొలాల్లో నీరు చేరడంతో కూలీలు ఇలా వరి నాట్లు వేస్తున్నారు. ఈ పొలాలకు సాగునీరు అందించే చెరువులో చుక్కనీరు లేదు. అడపాదడప పడుతున్న వానలే రక్ష. ముదురుతున్న వరి నారును అలా వదిలేయలేక, ఎంతోకొంత పంట వస్తుందనే ఆశతో పెట్టుబడి పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
శృంగవరపుకోట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో చెరువులు నీటితో కళకళలాడుతుండాలి. వీటి ద్వారా పొలాలకు పుష్కలంగా సాగునీరు అందుతుండాలి. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక చెరువుల్లో చుక్క నీరు కూడా చేరలేదు. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చుక్క నీరులేక చెరువులు క్రీడా మైదానాలను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో చెరువుల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజర్వాయర్లు, బోర్లు ఉన్న చోట్ల రైతులు ఉభాలు చేపట్టారు. మిగిలిన చోట్ల భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. గతంలో అడపదడపా కురిసిన వానలకు వరి ఎదలు, నాట్లు వేసిన రైతులు ఇప్పుడు చినుకు కోసం ఆకాశం వైపు చూస్తున్నాడు.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాలబట్టి 2026-2027 ఖరీప్ సీజన్‌లో సాధారణం కంటే 37.22శాతం వర్షపాతం తక్కువగా ఉంది. ప్రతి ఏటా 1,00,251 హెక్టార్లలో వరి సాగు జరగాల్సి ఉంది. ఈ సమయానికి శతశాతం వరి ఎదలు, నాట్లు పూర్తిచేసి రైతులు కలుపుతీత పనుల్లో బిజీగా ఉండాల్సి ఉంది. ఎరువులు, పురుగు మందులు జల్లుకోవడం చేస్తుండాలి. పెరుగుతున్న పంటలను చూస్తూ మురిసిపోతుండాలి. కానీ, ఈ పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల మచ్చుకైనా కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సాగు ముందుకు కదలడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 45,056 హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. అది కూడా రిజర్వాయర్లు, బోర్లు ఉన్నచోటే. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్, వాయుగుండాల ప్రభావంతో వానలు కురుస్తాయని రైతులు ఆశతో ఉన్నారు. అయితే, వరి నారు ముదిరిపోవడంతో నాట్లు వేసినా దిగుబడి తగ్గిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఎకరాకు సరిపడే నారు ఇప్పుడు 60 నుంచి 70 సెంట్లకు మాత్రమే వస్తుందని, అది కూడా దుబ్బు కడితే ఎంతోకొంత దిగుబడులు వస్తాయని అంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటలేంటి?
ఎన్‌నినో దృష్ట్యా రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రత్యామ్నాయంగా ఏఏ పంటలు సాగు చేయాలో చెప్పడం లేదు. మినుము, పెసర విత్తనాల కోసం మండలాల నుంచి ఇండింటెంట్‌లు సేకరించారు. ఆరుతడి కింద ఈ పంటలను సాగు చేస్తుంటారు. వర్షం ఏ మాత్రం అధికంగా పడినా ఇవి తట్టుకోలేవు. అందుకే వీటిని జిల్లా రైతాంగం వరి కోతలు చేపట్టేముందు నవంబరు ఆఖరున- డిసెంబర్ ప్రారంభంలో విత్తనాలను చల్లుతారు. రాగులు, అలసంద పంటలు పండించేందుకు అనుకూలమైనప్పటికీ ఈ విత్తనాలు వ్యవసాయశాఖ వద్ద సిద్ధంగా లేవు. వివిద రకాల ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి 6,245 క్వింటాళ్లు విత్తనాలు తెప్పించేందుకు ఇండెంట్ పెట్టామని ఈ శాఖ చెబుతుంది. రకాలను మాత్రం చెప్పడం లేదు. 26,665 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వీటి రామారావు స్పష్టం చేశారు.
- జిల్లాలో వరి, మొక్కజొన్న(35,096 హెక్టార్లు)కు సంబంధించి 60,273 మంది రైతులు పంటల బీమా చేయించుకున్నారు. రూ.172.71 లక్షల ప్రీమియం చెల్లించారు. ప్రతికూల పరిస్థితుల దృష్యా జిల్లాలోని మిగిలిన రైతులు కూడా బీమా చేసుకోవాలని వ్యవసాయశాఖ అవగాహన కల్పించించినా చాలామంది ముందుకు రాలేదు. పంటల బీమా గడువు గత నెలతో ముగిసింది.
వర్షపాతం ఇలా..
జాన్‌లో 123.5మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 96.3 మి.మీ పడింది. 22.02 మీ.మీ లోటు ఏర్పడింది. జూలైలో 170మి.మీ గాను 58.1మి.మీ నమోదైంది. 65.98 మి.మీ లోటు ఉంది. ఆగస్టులో 161.6 మి.మీ గాను 131 మి.మీ పడింది. 18.44 లోటు వర్షపాతం నెలకొంది.
పంటల సాగు ఇలా(హెక్టార్లలో)
సాధారణ సాగు విస్తీర్ణం: 1,23,608
వరి: 45,056
మొక్కజొన్న: 7,746
నువ్వులు: 2,416
పత్తి: 2,236
చెరుకు:1,606