Share News

A Feast for the Eyes… కనులపండువగా..

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:46 PM

A Feast for the Eyes… జిల్లా కేంద్రంలోని పార్వతీపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం 8 గంటలకు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి నుంచి కలశ యాత్రను నిర్వహించారు.

A Feast for the Eyes… కనులపండువగా..
పార్వతీపురం పట్టణంలో కలశయాత్ర

  • శ్రీవారి కలశయాత్రకు తరలివచ్చిన మహిళలు

  • ప్రత్యేక ఆకర్షణగా కోలాటం ప్రదర్శన

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌21(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పార్వతీపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం 8 గంటలకు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి నుంచి కలశ యాత్రను నిర్వహించారు. ఆసుపత్రి కూడలి మీదుగా వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. దారి పొడవునా కోలాటం ప్రదర్శన, భక్తల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు రుత్వికుల వేదమంత్రోశ్చరణల మధ్య స్వామి వారి పల్లకి ఊరేగింపు కన్నులపండువగా జరిగింది. ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. పలు కూడళ్లలో స్వామివారికి మహిళలు హారతులిచ్చారు.

పూర్వజన్మ సుకృతం: చిన జీయర్‌ స్వామి

పార్వతీపురం టౌన్‌/బెలగాం: కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ వందేళ్ల ఉత్సవంలో పాల్గొనడం తన పూర్వ జన్మసుకృత మని చిన్న జీయర్‌ స్వామి అన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రవచన సభలో ఆయన మాట్లాడుతూ... కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడ్ని పూజించడం వల్ల ధన్యులమవు తామన్నారు. ‘ఓం నమో వెంకటేశాయ’ అన్న నామసమ్మరణతో ప్రతి కుటుంబంలో ఆనంద జ్యోతులు వెలుగుతాయని తెలిపారు. ప్రతిఒక్కరూ హిందు ధర్మపరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గురువులు, పెద్దలను ఎలా గౌరవించాలో పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. కాగా తోటపల్లి దేవస్థానంలో 52 ఏళ్లుగా ఉన్న స్వామివారి విగ్రహాన్ని బయటపడేసి, కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పలువురు హైందవ సంఘాలు, బీజేపీ నాయకులు చినజీయర్‌ స్వామి దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

- సీతానగరం: భక్తితోనే ప్రతిఒక్కరూ ముక్తి పొందుతారని చినజీయర్‌ స్వామి తెలిపారు. మండల కేంద్రంలో వేణుగోపాలస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రానున్న రోజుల్లో ఈ రెండు ఆలయాలు విశేష ప్రాచుర్యం పొందుతాయని వెల్లడించారు.

Updated Date - Apr 21 , 2026 | 11:46 PM