Share News

పల్లె పోరకు మోగిన నగారా

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:31 AM

తొలివిడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ను విడుదల చేసింది.

పల్లె పోరకు మోగిన నగారా

-మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ విడుదల

-జిల్లాలో 8 మండలాల్లోని 221 పంచాయతీలకు నిర్వహణ

- రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

- 26న పోలింగ్‌.. అదే రోజు లెక్కింపు

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి):తొలివిడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి దశలో జిల్లాలోని రెండు డివిజన్లకు సంబంధించి 8 మండలాల్లో ఉన్న 221 పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నోటీసు జారీ చేస్తారు. అదే రోజు వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఈనెల 15 నుంచి 17 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 18న ఉదయం 8 గంటలు నుంచి నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై రెవెన్యూ డివిజనల్‌ అధికారి వద్ద సాయంత్రం 5 గంటలు లోగా అప్పీలు చేసుకోవచ్చు. 20న అప్పీళ్లపై నిర్ణయం వెలువడుతుంది. 21న మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులు తుది జాబితా ప్రకటిస్తారు. 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తారు. అదే రోజున ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో ఆ రోజు నిర్వహించలేకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. రీపోలింగ్‌ తప్పనిసరైతే ఈనెల 27న 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహిస్తారు.

Updated Date - Nov 14 , 2026 | 12:31 AM