A Dream of Decades... Finally Realized దశాబ్దాల కల.. నెరవేరిన వేళ
ABN , Publish Date - May 31 , 2026 | 11:29 PM
A Dream of Decades... Finally Realized విశాఖ జోన్ కార్యకలాపాలు అధికారికంగా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రం గజిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాలో పార్వతీపురం టౌన్, బెలగాం, సాలూరు, గుమడ, కూనేరు, సీతానగరం, రైల్వేస్టేషన్లు ఇక విశాఖ జోన్ పరిధిలోకి వచ్చాయి.
గజిట్ విడుదల చేసిన కేంద్రం
మన్యం వాసుల హర్షం
పార్వతీపురం, మే 31(ఆంధ్రజ్యోతి): విశాఖ జోన్ కార్యకలాపాలు అధికారికంగా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్రం గజిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాలో పార్వతీపురం టౌన్, బెలగాం, సాలూరు, గుమడ, కూనేరు, సీతానగరం, రైల్వేస్టేషన్లు ఇక విశాఖ జోన్ పరిధిలోకి వచ్చాయి. రైల్వే ఉద్యోగులు కష్టాలు కూడా తప్పాయి. వారి సమస్యలను విశాఖలో ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ప్రయాణికుల ఇక్కట్లు కూడా తీరనున్నాయి. జిల్లా యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం ఇకపై భువనేశ్వర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోనే ఆయా పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది.
విశాఖజోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం డివిజన్లు ఉంటాయి. ఇందులో 385 రైల్వేస్టేషన్లు ఉండగా, 62వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఒడిశా వెళ్లేవారికి బదిలీలు జరగ్గా ఉన్న సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించడానికి సౌత్‌కోస్ట్‌రైల్వేశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆరు నెలల పాటు విధులు నిర్వహించిన తరువాత శాఖాపరంగా కావాల్సిన ఉద్యోగుల భర్తీ జరుపుతామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల్లో సందడి నెలకొంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, మన్యం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు , జిల్లా మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తదితరులు కూడా రైల్వేజోన్ సాధనకు ఎంతో ప్రయత్నించారు. మొత్తంగా ప్రజాప్రతినిధులు, జిల్లావాసుల కల నెరవేరింది. నేటి నుంచి విశాఖ జోన్ పరిధిలో అధికార కార్యకలాపాలు ప్రారంభం కానుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
శుభ పరిణామం..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైల్వేజోన్ సాధించాం. జిల్లావాసుల కల నెరవేరింది. ఇందుకు ఎంతగానో కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. నేటి నుంచి విశాఖ కేం ద్రంగా రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇది శుభపరిణామం. సాలూరు రైల్వేస్టేషన్ పునరుద్ధరణ అంశాన్ని ఇప్పటికే రైల్వేశాఖామంత్రితో పాటు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం.
- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి
=====================
యువతకు ఉద్యోగావకాశాలు
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైల్వే జోన్ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు మరెందరో తీవ్రంగా కృషి చేశారు.
- బోనెల విజయచ్రంద, ఎమ్మెల్యే, పార్వతీపురం