Share News

లోయలో కలల సమాధి!

ABN , Publish Date - May 01 , 2026 | 12:50 AM

వారంతా నిరుపేద గిరిజనులు. శుభకార్యానికి ఆటోలో వెళ్లారు. అందరితో ఆనందంగా గడిపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు.

లోయలో కలల సమాధి!
లోయలో పడిన ఆటో,

100 అడుగుల లోయలో పడిన ఆటో

ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

నలుగురు మృతి.. వీరిలో ముగ్గురు మహిళలు

శోకసంద్రంలో రెండు గ్రామాల ప్రజలు

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోరం

వారంతా నిరుపేద గిరిజనులు. శుభకార్యానికి ఆటోలో వెళ్లారు. అందరితో ఆనందంగా గడిపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. సాయంత్రం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఘాట్‌రోడ్డు మీదకు వచ్చారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్లు చేయాలని చర్చించుకుంటున్నారు. మరికొందరు చిన్నపిల్లలు భద్రంగా ఉన్నారా? లేదా? అని చూసుకుంటున్నారు. ఇంకొందరు శుభకార్యం విషయాల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతలో ఊహించని కుదుపు. ఆటో అదుపుతప్పి 100 అడుగులకి పడిపోయింది. కొందరు చెల్లాచెదురుగా పడిపోయారు. ఇంకొందరు ఆటోలోనే ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. మీనకోట, జంపరకోట గ్రామాల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

సీతంపేట రూరల్‌/పాలకొండ, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలం జంపరకోటకు చెందిన 11 మంది గిరిజనులు సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి గురువారం ఆటోలో బయలుదేరి వెళ్లారు. శుభకార్యం చూసుకుని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. మీనకోట, జంపరకోట గ్రామాల మద్యలో ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తుండగా వీరిఆటో అదుపుతప్పి పక్కనే 100 అడుగుల లోతులో ఉన్న లోయలోకి పడిపోయింది. ఆటోలో ఉన్న వారిలో కొందరు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. వారంతా తీ వ్రగాయాలతో బయటపడ్డారు. ముగ్గురు ఆటోలోనే ఇరుక్కోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. డోలమడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ అక్కుపల్లి రమణ(36), జంపరకోట గ్రామానికి చెందిన ఉర్లకశాంతి(30), కొండగొర్రి శ్రావణి(25) ఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన ఆరికలక్ష్మి (55)ని స్థానికులు 108వాహనంలో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమెతో పాటు గాయాలపాలైన వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొండగొర్రి మౌనిక, నిమ్మక చాందినిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కొండగొర్రి శ్రీపద్మ, కె.మల్లమ్మ, కె.రుషికుమార్‌, కె.హేమలత పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటోలో వీరితో పాటు మరో చిన్నారి కె.రోషన్‌ గాయాలపాలవ్వగా ఇదే ఘటనలో తీవ్రగాయాలపాలైన తల్లి కె.మౌనికతో పాటు రిమ్స్‌కు తరలించారు.

మృతుల కుటుంబసభ్యులు ఇలా..

ఈ ప్రమాదంలో మృతిచెందిన ఆటో డ్రైవర్‌ అక్కుపల్లి రమణకు భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉర్లక శాంతికి భర్త లక్ష్మణరావుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మృతురాలు ఆరికలక్ష్మికి భర్త రామారావుతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. కొండగొర్రి శ్రావణికి భర్త భాస్కరరావుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముగ్గురు మృతులది జంపరకోట గిరిజన గ్రామం కాగా ఆటోడ్రైవర్‌ అక్కుపల్లి రమణది డోలమడ గ్రామం. ఈ రెండు గ్రామాల్లో విషాదం అలముకుంది.

త్వరలోనే కొడుకులకు పెళ్లి చేద్దామనుకుని..

తమ కొడుకులకు త్వరగా పెళ్లిళ్లు చేసి కోడళ్లను తెచ్చుకోవాలని ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు. కానీ విధి ఆ కలను 100 అడుగుల లోతైన లోయలో కలిపేసింది. శుభకార్యం చూసి మురిసిపోయిన కళ్లతో ఇంటికి తిరిగి వస్తుండగా లక్ష్మి అనే మహిళను మృత్యువు కబళించింది. ఎప్పుడూ కొడుకుల గురించే ఆలోచిస్తూ ఉండే భార్య ఇక లేదన్న విషయం భర్త రామారావు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల కొడుకులు ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆయన భోరున విలపించారు.

నాన్నా.. అమ్మ ఎక్కడ?

‘అమ్మ ఎప్పుడొస్తుంది. మాకు అమ్మ కావాలి’ అని ఆ చిన్నారులు అడుగుతుంటే అక్కడ ఉన్న వారిని కళ్లు చెమర్చాయి. తమకు ఎప్పుడూ తోడుగా ఉండే అమ్మ ఇక తిరిగి రాలేదనే విషయం తెలియని ఆ పసి హృదయాల ఆవేదన వర్ణనాతీతం. ఈ ప్రమాదంలో కొండగొర్రి రుషికుమార్‌, హేమలత అనే చిన్నారులు గాయపడ్డారు. వీరి తల్లి శ్రావణి. ఈ ప్రమాదంలోనే మృతి ఎందారు. ఈ విషయం వారికి ఇంకా తెలియదు. దీంతో అమ్మ కావాలంటూ తండ్రి భాస్కరరావును పదేపదే అడుగుతుండడం అక్కడున్న వారిని కలచివేసింది. అమ్మను చూపించాలని మారాం చేస్తుండడం అందరినీ కంటతడి పెట్టించింది.

క్షతగాత్రులను పరామర్శించిన ఎస్పీ, సబ్‌కలెక్టర్‌

క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుప త్రిలో ఎస్పీ మాధవరెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్‌ పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఎస్పీ ఎం.రాంబాబు పరామర్శించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చిరంజీవులకు సూచించారు. అనంతరం ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ ఆరా తీశారు.

Updated Date - May 01 , 2026 | 12:50 AM