Share News

Old Dream దశాబ్దాల కల.. నెరవేరేనా?

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:09 AM

A Decades-Old Dream... Will It Come True? రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లను ప్రారంభించడానికి, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేయడానికి సీఎం చంద్రబాబు ఇటీవల షెడ్యూల్‌ ప్రకటించారు. దీనిలో భాగంగా 2027 జనవరిలో జంఝావతి రిజర్వాయర్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

 Old Dream  దశాబ్దాల కల.. నెరవేరేనా?
జంఝావతి ప్రాజెక్టు

  • 2027, జనవరిలో రిజర్వాయర్‌ ప్రారంభిస్తామని వెల్లడి

  • జిల్లా రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

పార్వతీపురం, జూలై17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లను ప్రారంభించడానికి, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేయడానికి సీఎం చంద్రబాబు ఇటీవల షెడ్యూల్‌ ప్రకటించారు. దీనిలో భాగంగా 2027 జనవరిలో జంఝావతి రిజర్వాయర్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల నాటి సమస్యకు తెరపడనుందని ఆశిస్తున్నారు. వాస్తవంగా ఒడిశాతో ఉన్న వివాదం తేలకపోవడం వల్లే కొన్నేళ్లుగా జంఝావతి పెండింగ్‌ పనులు పూర్తికావడం లేదు. దీంతో ఏటా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందడం లేదు.

ఇదీ పరిస్థితి..

ఈ ప్రాజెక్టు నుంచి 24 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉన్నా.. కేవలం 9 ఎకరాలకు మాత్రమే నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం మండలాలకు అరకొరగా నీరు సరఫరా అవుతుంది. ప్రాజెక్టు పరిధిలో కాగా గరుగుబిల్లి మండలానికి నీరు సరఫరా అయ్యే కాలువ లో పూడికలు తొలగించ కపోవడంతో ఆ ప్రాంత రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. మొత్తంగా జంఝావతి కాలువలను అభివృద్ధి చేయకపోవడంతో ఏటా శివారు ప్రాంత రైతులు వరుణుడిపై ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. నిధులు లేకపోవడంతో అధికారులు పూడికల తొలగింపునకు ముందుకు రావడం లేదు. దీంతో ఐదు మండలాల పరిధిలోని రైతులే గండ్లు పూడ్చడంతో పాటు పిచ్చి మొక్కలు తొలగింపు వంటి పనులు చేపడుతున్నారు.

పనులు రద్దు చేసిన వైసీపీ

జంఝావతి ప్రాజెక్టు పనుల పూర్తికి గత టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.39 కోట్లు మంజరు చేసింది. అయితే ఈ లోపే ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. గత ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాలువల నిర్వహణకు కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో హైలెవెల్‌ కెనాల్‌ కాలువలు పిచ్చిమొక్కలతో నిండి అధ్వానంగా మారాయి. మొత్తంగా జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న నాటి సీఎం జగన్‌ ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం నాడు ఒడిశా సీఎంతో జగన్‌ భేటీ అయినా ఫలితం లేకపోయింది.

హామీని నెరవర్చే దిశగా..

జంఝావతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కురుపాంలో జరిగిన ఎన్నికల సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాదిలో ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఒడిశాతో ఉన్న వివాదం పరిష్కారం కాకపోయినప్పటికీ స్థానికంగా ఉన్న వనరులను వినియో గించుకుని పనులు పూర్తిచేయాలని యోచిస్తున్నారు. అయితే ఈ పెండింగ్‌ పనులు పూర్తయితే కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో సుమారు 20 వేల ఎకరాలకు పైబడి సాగునీరు అందుతుందని ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

పూడిక తీయరు.. సాగునీరు అందదు.

గరుగుబిల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువ పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో కురిసిన వర్షాల కారణంగా పార్వతీపురం మండలం అడ్డాపుశీల ప్రాంతంలో కాలువలో అధికంగా ఇసుక మేటలు వేశాయి. దీంతో గరుగుబిల్లి మండలానికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో నారుమళ్లు ఎండుతున్నాయి. సాగునీరు సరఫరా కాకుంటే మండలంలో ఉభాలు జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాగా వర్షాలు లేకుంటే నారుమళ్లు బతికే అవకాశం కనిపించడం లేదు.

తొలగింపునకు చర్యలు

అడ్డాపుశీల ప్రాంతంలోని కాలువలో పూడికల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాం. పార్వతీపురం మండలం బాలగుడబ వరకు ఉన్న కాలువలను శుభ్రపర్చాం. ప్రధానంగా రైతులే ముందుకు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జంఝావతి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 150 క్యూసెక్కుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. గరుగుబిల్లి మండలానికి సాగునీరు సరఫరా అయ్యేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులు కూడా ముందుకు రావాల్సి ఉంది.

- పి.పవన్‌కుమార్‌, జంఝావతి ప్రాజెక్టు ఏఈ, పార్వతీపురం

Updated Date - Jul 18 , 2026 | 12:09 AM