Share News

Relax and Unwind! సెలవురోజు.. సేదదీరేందుకు వెళ్లి!

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:58 PM

A Day Off… Out to Relax and Unwind! మరుసటి రోజు నుంచి సెమిస్టర్‌ పరీక్షలు. సోమవారం సెలవు. కాస్త సేదదీరుదామని స్నేహితులంతా సముద్రతీరానికి వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు కళ్లముందే కొట్టుకుపోయారు. వారిని కాపాడలేక నిస్సహాయ స్థితిలో మిగిలిన విద్యార్థులు తల్లడిల్లిపోయారు. ఒకరు మాత్రం ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగా.. ఇద్దరి ఆచూకీ మాత్రం గల్లంతైంది.

 Relax and Unwind!  సెలవురోజు.. సేదదీరేందుకు వెళ్లి!
సముద్రంలో గల్లంతైన గంగాధర్‌ మణికంఠ

  • వారిలో జిల్లావాసి ఒకరు..

  • స్వగ్రామం ఘనసరలో విషాదం

ఎచ్చెర్ల/శ్రీకాకుళం కైరం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మరుసటి రోజు నుంచి సెమిస్టర్‌ పరీక్షలు. సోమవారం సెలవు. కాస్త సేదదీరుదామని స్నేహితులంతా సముద్రతీరానికి వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు కళ్లముందే కొట్టుకుపోయారు. వారిని కాపాడలేక నిస్సహాయ స్థితిలో మిగిలిన విద్యార్థులు తల్లడిల్లిపోయారు. ఒకరు మాత్రం ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగా.. ఇద్దరి ఆచూకీ మాత్రం గల్లంతైంది. దీంతో ఆ విద్యార్థుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది.

శ్రీకాకుళం మండలం పుక్కళ్లవానిపేట బీచ్‌ (ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌) వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇద్దరు గల్లంతుకాగా.. మరొకరు క్షేమంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారికోసం మెరైన్‌, రూరల్‌ పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాల తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం మండలం పుక్కళ్లపేట ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతికి భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన జి.మణికంఠ (22), రాజాం పట్టణానికి చెందిన జి.మనోజ్‌ (21) గల్లంతయ్యారు. ఎచ్చెర్లకు చెందిన మరో విద్యార్థి అల్లు లిఖిత్‌ తోటి విద్యార్థుల సాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. కళ్ల ముందే ఇద్దరు స్నేహితులు గల్లంతుకావడంతో మిగిలిన విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కళింగపట్నం మెరైన్‌ సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు రూరల్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా గాలించినా.. వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ ఇద్దరి విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోందని మెరైన్‌ సీఐ ప్రసాదరావు తెలిపారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌పీవీ రమణమూర్తినాయుడు వద్ద ప్రస్తావించగా.. ‘బీటెక్‌ తృతీయ సంవత్సరం విద్యార్థులకు 3(1) సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతుకావడం విషాదకరం. ఆ విద్యార్థులు డే స్కాలర్స్‌. సోమవారం వారికి తరగతులు కూడా లేవ’ని తెలిపారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

భామిని: ఘనసర గ్రామానికి చెందిన జగన్నాథం, సరస్వతిలు కూరగాయలు పండించుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా తనయుడు మణికంఠను ఎచ్చెర్లలో చదివిస్తున్నారు. అయితే శనివారం స్వగ్రామానికి వచ్చిన ఆ యువకుడు తల్లిండ్రులు, సోందరితో కలిసి ఆనందంగా దీపావళి పండుగ జరపుకున్నాడు. అయితే సోమవారం తిరిగి కాలేజీకి బయల్దేరిన మణికంఠ సముద్రంలో గల్లంతైనట్లు తెలియడంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. హుటాహుటిన ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా ఈ వార్తతో బంధువులుక, కుటుంబ సభ్యులు, ఘనసర గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Updated Date - Nov 09 , 2026 | 11:58 PM