A check on extortion in private medicine ప్రైవేటు వైద్యంలో దోపిడీకి చెక్
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:48 PM
A check on extortion in private medicine ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్ చికిత్స పేరుతో సాగుతున్న అడ్డుగోలు దోపీడీకి ప్రభుత్వం చెక్‌పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబ సభ్యుల అసహాయతను ఆసరాగా చేసుకుని భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ( డీజీహెచ్‌ఎస్) తీవ్రంగా స్పందించింది.
ప్రైవేటు వైద్యంలో
దోపిడీకి చెక్
వెంటిలేటర్ వినియోగంపై కొత్త నిబంధనలు
రోగి కుటుంబ సభ్యులు అనుమతి తప్పనిసరి
లేని పక్షంలో చెల్లింపు అవసరం లేదు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
విజయనగరం రింగురోడ్డు, జనవరి 7(ఆంధ్రజ్యోతి):
ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్ చికిత్స పేరుతో సాగుతున్న అడ్డుగోలు దోపీడీకి ప్రభుత్వం చెక్‌పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబ సభ్యుల అసహాయతను ఆసరాగా చేసుకుని భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ( డీజీహెచ్‌ఎస్) తీవ్రంగా స్పందించింది. వైద్యం వ్యాపారంగా మారకూడదని, వెంటిలేటర్ ప్రాణాలు కాపాడే సాధనంగా ఉండాలని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే, ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొత్త నిబంధనల ప్రకారం ఏ రోగినైనా వెంటిలేటర్‌పై ఉంచే ముందు వారి సంరక్షకులకు పూర్తిసమాచారం అందించాలి. రోగి పరిస్థితి... వెంటిలేటర్ అవసరం, కలిగే ప్రయోజనాలు, రిస్క్‌ను వివరిస్తూ వారి నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. ఒక వేళ కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా వారి అనుమతి లేకుండా వెంటిలేటర్ వినియోగిస్తే ఆ ఖర్చును చెల్లించాల్సిన బాధ్యత రోగి బంధువులపై ఉండదు.
ఫ బిల్లింగు విషయంలో పారదర్శకత కోసం ఆసుపత్రులు తప్పనిసరిగా ధరలు పట్టిక (టారిఫ్ బోర్డు)లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఐసీయూ, వెంటిలేటర్ చార్జీలను ఆసుపత్రిలోని బిల్లింగ్ కౌంటర్లు, ఐసీయూ వార్డుల వెలుపల ప్రజలకు కన్పించేలా ప్రదర్శించాలి.
ఫ వెంటిలేటర్ వినియోగించిన గంటలు లేదా రోజులకే బిల్లు వేయాలి. స్టాండ్‌బైలో ఉంచిన సమయానికి చార్జీలు వసూలు చేయకూడదు.
ఫ వెంటిలేటర్ చికిత్సలో వాడే ఫిల్టర్లు, సర్య్కూట్‌లు వంటి వస్తువుల ధరలను విడివిడిగా పేర్కొనాలి.
13 రోజులు దాటితే ఆడిట్
వెంటిలేటర్ వాడకాన్ని అనవసరంగా పొడిగిస్తున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా కేసులో రోగి 14 రోజులు కంటే ఎక్కువ కాలం వెంటిలేటర్‌పై ఉంటే ఆసుపత్రిలోని ఒక ప్రత్యేక మల్టీ డిస్‌ప్లేనరీ కమిటీ ఆ కేసును సమీక్షించాలి. చికిత్స సక్రమంగా జరుగుతోందో? లేదో అనేదానిపై అంతర్గత ఆడిట్ నిర్వహించి రికార్డులను భద్రపరచాలి. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
డాక్టరు ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం
ప్రైవేటు ఆసుపత్రులు వెంటిలేటర్ చికిత్స విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలి. వెంటిలేటర్ ఏర్పాటుకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి. ఏ ఆసుపత్రి అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు నా దృష్టికి వస్తే విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రోగుల నుంచి అదనపు వసూళ్లు పాల్పడినా, చికిత్సలో పారదర్శకత లోపించినా, బాధితులు నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం.