Horticulture Sector ఉద్యాన రంగంతో ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:59 PM
A Bright Future with Horticulture Sector ఉద్యాన రంగంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉల్లిభద్ర డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన కళాశాలలో 12వ అంతర్ కళాశాల సాంస్కృతిక, సాహిత్య సమ్మేళనం నిర్వహించారు.
గరుగుబిల్లి, మార్చి24(ఆంధ్రజ్యోతి): ఉద్యాన రంగంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉల్లిభద్ర డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన కళాశాలలో 12వ అంతర్ కళాశాల సాంస్కృతిక, సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏఐతో సాఫ్ట్‌వేర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినా ఉద్యాన రంగానికి సంబంధించి ఎటువంటి మార్పు రాలేదన్నారు. ఉపాధికి ఉద్యాన రంగం దోహదపడుతుందని తెలిపారు. ఉద్యాన రంగానికి ఉన్న ప్రాముఖ్యత, ఆవశ్యకత ఎప్పటికీ తగ్గదన్నారు. మొక్కలు పెంపకం, సంరక్షణ వంటి అంశాల్లో మానవ ప్రమేయం, విద్యార్థుల నైపుణ్యం ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో ప్రతిభను చాటు కోవాలన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ముస్తాబు కార్యక్రమంలో వైఎస్‌ఆర్ ఉద్యాన కళాశాల భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు. పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో మొక్కలు నాటి ఆహ్లాదకరంగా మార్చుతున్నామని, వాటికి దీటుగా కళాశాలను తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా సృజనాత్మకత కార్యక్రమాల్లో చొరవ చూపాలన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.ధనుంజయరావు మాట్లాడుతూ.. ఉద్యాన రంగంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయికి చేరుకునేలా ప్రత్యేక చర్యలు చేపడు తున్నామని తెలిపారు. విద్యను అభ్యసించే వారు ప్రకృతికి అత్యంత సమీపంలో ఉండటం అదృష్టమన్నారు. ఉద్యాన రంగం మానసిక ప్రశాంతతను అందిస్తుందన్నారు. విశ్వ విద్యాలయం పరిధిలోని ఎనిమిది కళాశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీన్ బి.ప్రసన్నకుమార్, అసోసియేట్ డీన్ ఆర్.రాజ్యలక్ష్మి, జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదదితరులు పాల్గొన్నారు.