A bribe to move a file ఫైల్ కదలాలంటే లంచం
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:53 PM
A bribe to move a file రెవెన్యూ శాఖలో లంచం ఇవ్వనిదే ఫైల్ కదలదన్న ఆరోపణలకు తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలే ఉదాహరణ. కొన్ని పనులకు రేటు కట్టి రూ.లక్షల్లో అడుగుతున్నారు. వారికి కొందరు పైఅధికారులు సహకరిస్తున్నారు.
ఫైల్ కదలాలంటే లంచం
రూ.లక్షలు డిమాండ్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది
సహకరిస్తున్న అధికారులు
ఏసీబీకి పట్టుబడుతున్న వైనం
ఇతర శాఖల్లోనూ అవినీతి
- భోగాపురం మండలం చాకివలస ఇన్‌చార్జి వీఆర్వో అంబటి రామపైడి చిట్టిబాబు రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ రైతు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.2.40 లక్షలకు బేరం కుదరగా.. ముందస్తుగా రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
- గత ఏడాది ఆగస్టు 21న వేపాడ మండలం సింగరాయి వీఆర్వో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రూ.లక్ష ఇవ్వనిదే మ్యూటేషన్ చేయనని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారు ఇచ్చిన సలహా మేరకు రూ.లక్ష ఇస్తుండగా విజయనగరం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా వీఆర్వోను పట్టుకున్నారు. డెంకాడ మండలం బడ్డువలస వీఆర్‌వో, జామి మండలం అలమండ వీఆర్‌వో కూడా ఏసీబీ వలకు చిక్కారు.
రెవెన్యూ శాఖలో లంచం ఇవ్వనిదే ఫైల్ కదలదన్న ఆరోపణలకు తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలే ఉదాహరణ. కొన్ని పనులకు రేటు కట్టి రూ.లక్షల్లో అడుగుతున్నారు. వారికి కొందరు పైఅధికారులు సహకరిస్తున్నారు. వీరు తెర వెనుక పాత్ర పోషిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఏసీబీ దాడుల్లో ఎక్కువగా కిందిస్థాయి సిబ్బందే దొరుకుతున్నారు. రెవెన్యూతో పాటు మునిసిపల్, పంచాయతీరాజ్, రిజిస్ర్టేషన్లు, పోలీస్ శాఖలోనూ వివిధ రూపాల్లో అవినీతి చాయలు కనిపిస్తూనే ఉన్నాయి. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నా తగ్గడం లేదు.
విజయనగరం/ క్రైం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే లంచం ఇవ్వాలి. పౌరసేవల కోసం లంచం ఇవ్వాలి. చివరకు న్యాయబద్ధంగా రావాల్సిన రాయితీ పొందాలన్నా చేయి తడపాల్సిందే. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని శాఖల్లోనూ అవినీతి మరక అంటుతూనే ఉంది. ప్రభుత్వ శాఖలో ఏ చిన్నపనైనా ఉంటే చాలు అక్కడ ‘వసూలు రాజాలు’ వాలిపోతున్నారు. వారే అన్ని పనులు పూర్తిచేస్తున్నారు. అందుకు ఇంత ఇచ్చుకోవాల్సిందేనని షరతు పెడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్, రిజిస్ర్టేషన్లు, పోలీస్ శాఖలో ఈ పంథా నడుస్తోంది. రెవెన్యూ శాఖలో కాస్త అధికం. పెద్దస్థాయి అధికారుల సాయంతో సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీకి చిక్కి మూల్యం చెల్లించుకుంటున్నారు.
సంవత్సరాలుగా రెవెన్యూశాఖపై అత్యధికంగా ఆరోపణలున్నాయి. రైతులకు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్, సర్వే, ఆన్‌లైన్‌లో భూమి వివరాలు నమోదు, ధ్రువపత్రాల జారీ, ఇసుక రవాణా తదితర వ్యవహారాల్లో ఎక్కువగా అక్రమార్జనకు అవకాశాలుంటున్నాయి. ఈ శాఖలో చేయితడిపితే చాలు పని అయిపోతుందని చెబుతారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల బిల్లుల విషయంలో కూడా అధికారులు, సిబ్బంది వాటాలు అడుగుతున్నారు. ఆ ప్రభావం పనుల నాణ్యతపై పడుతోంది. కాంట్రాక్టర్లు వీలైనంత మిగుల్చుకోవాలనే ఆలోచనలో ఉంటున్నారు. ఫలితంగా ప్రజలకు నాలుగు కాలాల పాటు ఉపయోగపడాల్సిన నిర్మాణాలు కొద్దికాలానికే పాడవుతున్నాయి. పట్టణాల్లో టౌన్‌ప్లానింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అప్రూవల్, అసెస్‌మెంట్ తదితర పనులకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నేరుగా మునిసిపల్ కమిషనర్లే లంచం తీసుకుంటూ పట్టుబడిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని పాలకొండ నగర పంచాయతీలో ఏకంగా నలుగురు కమిషనర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో కూడా కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ప్రజలు చైతన్యవంతులైతేనే..
పనులను త్వరితగతిన పూర్తిచేయించుకోవాలన్న ఆత్రుతతో ప్రజలు కూడా లంచాన్ని ప్రోత్సహిస్తున్నారు. సామాజిక బాధ్యతగా అవినీతి నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఉంది. లంచం అడిగిన వెంటనే ఏసీబీకి ఫిర్యాదుచేస్తే సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచుతారన్న విషయం తెలుసుకోవాలి. ఎక్కడైనా..ఎవరైనా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేయాలి. మన జిల్లాకు సంబంధించి విజయనగరంలో కార్యాలయం ఉంది. ఆపై ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400కు సైతం ఫిర్యాదు చేయవచ్చు.
వీఆర్వో ఒక్కరికే రూ.3లక్షలా... ?
భోగాపురం తహసీల్డార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నేపఽథ్యంలో అనేక ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సాధారణ వీఆర్వో మూడులక్షలు లంచం డిమాండ్ చెయ్యటమంటే ఆశామాషి వ్యవహారం కాదు.. ఇది పైస్థాయివాళ్లకు తెలియకుండా ఉండదనే విమర్శలు బహాటంగానే వినిపిస్తున్నాయి. భోగాపురం మండలంలో అవినీతికి రియల్ భూమ్ ఓ కారణం. ఎయిర్ పోర్టు రావటంతో మరింతగా పెరిగింది.
ప్రజల్లో చైతన్యం రావాలి
ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పనిచేయించుకోవడం ప్రజల హక్కు. ప్రభుత్వం వారికి వేతనం ఇస్తోంది. అందుకే ఎక్కడైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయండి. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాం. ఏ భయం వద్దు. అవసరమైతే ఫిర్యాదుదారులకు రక్షణ కల్పిస్తాం. స్వేచ్ఛగా ఫిర్యాదు చేయాలి.
- ఎం.రమ్య, ఏసీబీ డీఎస్పీ, విజయనగరం
కొనసాగిన ఏసీబీ తనిఖీలు
భోగాపురం, ఫిబ్రవరి24(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వేకువజాము వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. మ్యుటేషన్ కోసం వీఆర్వో రూ.లక్ష లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము సుమారు 5గంటల వరకు తహసీల్దార్ కార్యాలయంలోనే తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, ఆన్‌లైన్ వివరాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. లంచం తీసుకొంటూ పట్టుబడిన అంబటి రామపైడి చిట్టిబాబు నుంచి, బాధిత రైతు లంక బంగారునాయుడు నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేసుకొన్నారు. అలాగే కార్యాలయంలో తహసీల్దార్ ఎం.రమణమ్మతో పాటు తహసీల్ధార్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరినీ విచారించి వివరాలు తీసుకున్నారు. వీఆర్వో చిట్టిబాబును మంగళవారం ఉదయం రిమాండు కోసం ఏసీబీ అధికారులు తహసీలార్ కార్యాలయం నుంచి తరలించారు.
----------