A bribe to get bills passed బిల్లులు మంజూరు చేయాలంటే లంచం
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:30 AM
A bribe to get bills passed : సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనం బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా శనివారం పట్టుబడ్డారు. రూ.లక్షా 20 వేలు లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. నిందితులిద్దరినీ విశాఖ ఏసీబీ కోర్టుకు రిమాండ్ కోసం తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ ఎంఎన్ రమ్య తెలిపారు.
బిల్లులు మంజూరు చేయాలంటే లంచం
రూ.లక్షా 50 వేలు డిమాండ్ చేసిన ఏఈఈ, వర్క్‌ఇన్‌స్పెక్టర్
ఏసీబీకి చిక్కిన అధికారులు
గజపతినగరం/మెంటాడ, మార్చి28(ఆంధ్రజ్యోతి): సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనం బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా శనివారం పట్టుబడ్డారు. రూ.లక్షా 20 వేలు లంచం తీసుకుంటుండగా దొరికిపోయారు. నిందితులిద్దరినీ విశాఖ ఏసీబీ కోర్టుకు రిమాండ్ కోసం తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ ఎంఎన్ రమ్య తెలిపారు.
మెంటాడ గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ కలిపి రూ.3లక్షలతో ఎస్సీకాలనీలో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు రూ.2లక్షల 20 వేలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని గత ఏడాది డిసెంబరులో చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని సర్పంచ్ రేగడి రాంబాబు కొద్దిరోజులుగా ఏఈఈ పల్లి గౌతమ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ పెదిరెడ్ల సంతోష్‌లను సంప్రదిస్తున్నాడు. ఇందుకు వారు లంచం డిమాండ్ చేశారు. రూ. 5లక్షల విలువ చేసే పనులకు రూ.లక్షా 50 వేలు ఇవ్వాలన్నారు. దీంతో బాధపడిన సర్పంచ్ ఈనెల 24న ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు చెప్పిన ప్రణాళిక ప్రకారం ఏఈఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్‌తో సర్పంచ్ లంచం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. శనివారం స్థానిక సబ్ డివిజన్ పంచాయతీరాజ్ కార్యాలయంలో రూ.లక్షా 20వేలు లంచం ఇస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యేండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఎంఎన్ రమ్య, సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్‌ఐ కె.వాసు నారాయణ తెలిపారు.
ఏఈఈ తీరుపై తొలి నుంచీ ఆరోపణలు
సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్ భవనాల బిల్లులు మంజూరుకు మెంటాడ సర్పంచ్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి శనివారం పట్టుబడిన మెంటాడ పీఆర్ ఏఈఈ పల్లి గౌతమ్‌పై తొలి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. చేతివాటం ఎక్కువని చెప్పుకుంటున్నారు. పర్సంటేజీ ఇచ్చేస్తే జరగని పనిని కూడా జరిగిపోయినట్టు బిల్లులు మంజూరు చేయించగలడంటున్నారు. మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో రోడ్డు వేయకుండానే వేసినట్టు పంచాయతీ నుంచి బిల్లులు మంజూరు చేయించిన ఉదంతాన్ని ఉదహరిస్తున్నారు. మెంటాడ గద్ది చెట్టు ఎదురుగా 2023లో గడగడపకు ప్రభుత్వంలో వేయించిన రోడ్డు రెండేళ్లకే నామరూపాలు కోల్పోతే, తాజాగా మరో మూడు లక్షలతో రోడ్డు మంజూరు చేయించి నాణ్యతతో సంబంధం లేకుండా మమ అనిపించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వేయించిన రోడ్లన్నీ మూన్నాళ్ల ముచ్చటే అయ్యాయని అప్పట్లోనే ఆ పార్టీ శ్రేణులు పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ నేతలు అప్పట్లో ఏఈఈని కావాలని తెచ్చుకున్నారు. వైసీపీ విధేయునిగా ముద్రపడ్డారు. కొన్నాళ్ల కిందట ఆగూరు, పోరాం, లోతుగెడ్డ తదితర గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లలో నాణ్యతలోపం వల్ల మెటల్ తేలిపోయిందని సోషల్ ఆడిట్ సిబ్బంది తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏసీబీ ట్రాప్‌కి చిక్కారన్న వార్త కలకలం సృష్టిస్తోంది. ఈయనతో పాటు వర్క్ ఇన్‌స్పెక్టర్ పెదిరెడ్ల సంతోష్ కూడా ఏసీబీకి పట్టుబడ్డాడు.