చేనేతకు ఊతం
ABN , Publish Date - May 11 , 2026 | 12:44 AM
జిల్లాలో చేనేత రంగం గాడిన పడుతోంది. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది.
- 704 మందికి ఉచిత విద్యుత్
- ఏప్రిల్ నెల చార్జీ సున్నా..
- త్వరలో సంఘాలకు ఎన్నికలు
- ఇంకా ఏర్పాటు కాని చేనేతశాల
- ఆశగా ఎదురుచూస్తున్న కార్మికులు
రాజాం, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేనేత రంగం గాడిన పడుతోంది. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వాడే వారికి 500 యూనిట్లు అందిస్తోంది. తొలి దశలో 704 మంది ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. వీరికి ఏప్రిల్ నెలకు సంబంధించి సున్నా విద్యుత్ చార్జీలు వచ్చాయి. రెండో విడతగా విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఉచిత విద్యుత్ అందిస్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేనేత రంగం నిర్వీర్యమైంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, ఇతరత్రా వసతులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో వేలాది చేనేత కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. కొందరు వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా పథకాలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా ఉచిత విద్యుత్ అందించింది. అలాగే త్రిఫ్ట్ అనే పథకాన్ని పునరుద్ధరించింది. నేతన్నలు తమకు వచ్చే ఆదాయంలో 8 శాతాన్ని డిపాజిట్‌చేస్తే..దానికి 16 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది. 90 రోజుల్లో ఆ మొత్తం చేనేత కార్మికుడికి అందుతుంది. ఉదాహరణకు కార్మికుడు రూ.2 వేలు డిపాజిట్ చేస్తే ప్రభుత్వం రూ.4 వేలు కలుపుతుంది. మూడు నెలల్లో మొత్తం రూ.18 వేలు అందిస్తుందన్న మాట. 2014 నుంచి 2019 వరకూ పథకం అమలైంది. అప్పట్లో ఈ పథకంలో 150 మంది వరకూ నమోదయ్యారు. ఆర్థికంగా లబ్ధి పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పునరుద్ధరించింది. ఉచిత విద్యుత్‌తో వారికి కొంత ఉపశమనం కలిగింది.
గతం మాదిరిగా ఎన్నికలు..
చేనేత సొసైటీల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జిల్లాలో చేనేత రంగంపై ఆధారపడిన వారి సంఖ్య అధికం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 25 సహకార సంఘాల పరిధిలో 4 వేల మంది సభ్యులు ఉన్నారు. అయితే క్రమేపీ అవి తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఇప్పుడు 12 సంఘాలే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 2,500 చేనేత కుటుంబాల్లో కేవలం 2200 మంది మాత్రమే మగ్గాలుపై పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలే చేనేత వృత్తి తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రధానంగా పట్టు, నూలు వంటి మూడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తేసింది. నూలు, రంగులు, రసాయనాలపై 18శాతం జీఎస్టీని విధించింది. అటు వైసీపీ హయాంలో చేనేత హస్తం అన్న పథకం తప్పించి ఎటువంటి సాయం అందకుండా పోయేది. గతంలో ప్రభుత్వాలు రాయితీపై బ్యాంకు రుణాలు, మగ్గాలు, ఇతరత్రా పరికరాలు అందించేవి. చేనేత కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు కూడా అందేవి. కానీ గత ఐదేళ్లలో ఏడాదికి ఒకసారి చేనేత హస్తం తప్పించి మరొకటి అందించిన దాఖలాలు లేవు. అవి కూడా చాలామంది అర్హులకు అందకుండా పోయేవి. అయితే ఇప్పుడు సొసైటీలకు జవసత్వాలు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. గతం మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. తద్వారా సొసైటీల్లో సభ్యులు క్రియాశీలకమవుతారని అంచనా వేస్తోంది.
చేనేతశాల ఏర్పాటయ్యేనా?
రాజాం మండలం పెనుబాకలో చేనేతశాల ఏర్పాటుకు ఏడాది కిందట సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ ఎందుకో తరువాత దీనిపై ఎటువంటి కదలిక లేదు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో చేనేత కార్మికులు అధికం. లోకేష్ చొరవతో అక్కడ చేనేత శాలను ఏర్పాటుచేశారు. అటువంటి చేనేత శాల ఏర్పాటుకు జిల్లాలో రాజాం మండలం పెనుబాక సరైన ప్రాంతమని ఎంపిక చేశారు జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
చేనేత అభివృద్ధిపై దృషి
జిల్లాలో 704 మంది ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వారికి సున్నా చార్జీ వచ్చింది. చేనేత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. త్రిఫ్ట్ పథకాన్ని పునఃప్రారంభిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సొసైటీలకు ఎన్నికలు పూర్తిచేసి త్రిఫ్ట్ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపికచేస్తాం. జిల్లాలో చేనేత శాల ఏర్పాటుకు రాజాం మండలం పెనుబాకలో ఒక ఎకరా భూమిని సైతం గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం.
- శ్రీను, చేనేత జౌళిశాఖ అధికారి, విజయనగరం