Share News

చేనేతకు ఊతం

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:52 PM

చేనేత రంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా పథకాలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

చేనేతకు ఊతం

- త్రిఫ్ట్‌ పథకం పునరుద్ధరణ

- కార్మికులకు ఎంతో మేలు

- మూడు నెలల్లో మూడు రెట్ల సాయం

రాజాం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చేనేత రంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా పథకాలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. గతంలో చేనేత కార్మికులకు మేలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది. అందులో భాగంగా త్రిఫ్ట్‌ అనే పథకాన్ని తిరిగి ప్రారంభించింది. నేతన్నలు తమకు వచ్చే ఆదాయంలో 8 శాతాన్ని డిపాజిట్‌ చేస్తే..దానికి 16 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది. 90 రోజుల్లో ఆ మొత్తం చేనేత కార్మికుడికి అందుతుంది. ఉదాహరణకు కార్మికుడు రూ.2 వేలు డిపాజిట్‌ చేస్తే ప్రభుత్వం రూ.4 వేలు కలుపుతుంది. మూడు నెలల్లో మొత్తం రూ.18 వేలు అందిస్తుందన్న మాట. 2014 నుంచి 2019 వరకూ పథకం అమలైంది. అప్పట్లో ఈ పథకంలో 150 మంది వరకూ నమోదయ్యారు. ఆర్థికంగా లబ్ధి పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని నిలిపివేసింది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పునరుద్ధరించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 22 చేనేత సంఘాలు ఉన్నాయి. అందులో 11 సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. 756 కార్మిక కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నింటికీ సాయం వర్తించేలా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. తాజాగా ఈ త్రిఫ్ట్‌ పథకంతో రాజాం సహకార సంఘంలో 85 మంది కార్మికులకు రూ.1,30,268, కొట్టక్కి సంఘంలో 50 మందికి రూ.64,082, కోటగండ్రేడులో 109 మంది సభ్యులకు రూ.94,184, బొద్దాంలో 25 మంది సభ్యులకు రూ.37,852, పెనుబాక చేనేత సంఘంలో 30 మంది సభ్యులకు రూ.44,334 లబ్ధి చేకూరనుంది.

తగ్గిన సంఘాలు, సభ్యులు..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో 25 సహకార సంఘాల పరిధిలో 4 వేల మంది సభ్యులు ఉండేవారు. అయితే క్రమేపీ ఈ సంఖ్య తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఇప్పుడు 12 సంఘాలే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 2,500 చేనేత కుటుంబాల్లో కేవలం 2200 మంది మాత్రమే మగ్గాలుపై పనిచేస్తున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో పరిణామాలే చేనేత వృత్తి తగ్గుముఖం పట్టడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రధానంగా పట్టు, నూలు వంటి ముడి సరుకులపై కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎత్తేసింది. నూలు, రంగులు, రసాయనాలపై 18శాతం జీఎస్టీని విధించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత హస్తం అన్న పథకం తప్పించి ఎటువంటి సాయం అందకుండా పోయేది. గతంలో ప్రభుత్వాలు రాయితీపై బ్యాంకు రుణాలు, మగ్గాలు, ఇతరత్రా పరికరాలు అందించేవి. చేనేత కార్పొరేషన్‌ ద్వారా విరివిగా రుణాలు కూడా అందేవి. కానీ గత ఐదేళ్లలో ఏడాదికి ఒకసారి చేనేత హస్తం తప్పించి మరొకటి అందించిన దాఖలాలు లేవు. అవి కూడా చాలామంది అర్హులకు అందకుండా పోయేవి. అయితే ఇప్పుడు సొసైటీలకు జవసత్వాలు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. గతం మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా సొసైటీల్లో సభ్యులు క్రియాశీకలమవుతారని అంచనా వేస్తోంది. త్రిఫ్ట్‌ పథకం పునరుద్ధరణతో వారికి కొంత ఉపశమనం దక్కినట్టు అయింది.

వినియోగించుకోవాలి

చేనేత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. త్రిఫ్ట్‌ పథకాన్ని ప్రారంభించింది. దీనిని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఎంతో మంచి పథకం. అందుకే ప్రతి సభ్యుడు వినియోగించుకోవాలి.

-ఆర్వీ మురళీకృష్ణ, ఏడీ, చేనేత జౌళిశాఖ, విజయనగరం

Updated Date - Jan 27 , 2026 | 11:52 PM