గిరిజన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:05 AM
గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.
పాచిపెంట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. శనివారం సతాబి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లింకు రోడ్లు నిర్మిస్తున్నామని, అవసరమైన ప్రతీ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే వేసవి దృష్ట్యా ఏజెన్సీలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి గత ఐదేళ్లుగా సర్వేలు జరుగుతున్నాయని, గిరిజనులు హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దని మూకుమ్మడిగా తెలియజేయడంతో వెంటనే కలెక్టర్‌కు చెప్పి సర్వేలు ఆపించానన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా విన్నవించుకుంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు మంజూరు చేయాలని గిరిజనులు కోరడంతో సాలూరు నియోజకవర్గం పరిధిలో ఒకేసారి అందరికీ పట్టాలు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సాలూరు నియోజకవర్గం పరిధిలో గల సాలూరు మండలం ఖరడవలసలో కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన చోట పాచిపెంట మండలంలో కూడా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి సమక్షంలో 500 గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. సతాబి, గొట్టూరు, తంగలాం, బొర్రమామిడి, మూటకూడు, గరిసిగుడ్డి పంచాయతీలలో గల గిరిజన కుటుంబాలు టీడీపీలో శనివారం చేరాయి. పార్టీలో చేరిన వారికి మంత్రి సంధ్యారాణి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సతాబి పంచాయతీ సర్పంచ్ శిల్పజన్ని రామయ్య ఆధ్వర్యంలో వారంతా టీడీపీలో చేరారు. కార్యక్రమంలో సాలూరు ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పాచిపెంట టీడీపీ అధ్యక్షులు గూడేపు యుగంధర్, సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.