A 20-Year Dream Comes True ఇరవై ఏళ్ల కల.. నెరవేరిన వేళ
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:52 PM
A 20-Year Dream Comes True సన్యాసిరాజుపేట వాసుల ఇరవై ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కూటమి ప్రభుత్వ చొరవతో ఆ గ్రామ రహదారికి మోక్షం కలిగింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందంలో గ్రామస్థులు
గరుగుబిల్లి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): సన్యాసిరాజుపేట వాసుల ఇరవై ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కూటమి ప్రభుత్వ చొరవతో ఆ గ్రామ రహదారికి మోక్షం కలిగింది. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా సన్యాసిరాజుపేట ప్రధాన రహదారి అడుగడుగునా గోతులతో దర్శనమిచ్చేది. కొన్నాళ్లుగా ప్రజలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగించలేని పరిస్థితి. రహదారికి ఆనుకుని ఒకవైపు చెరువు, మరోవైపు లోతైన పంట పొలాలు ఉండడంతో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. గత వైసీపీ సర్కారు కూడా దీనిపై దృష్టి సారించలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామస్థుల సమస్యను పరిగణనలోకి తీసుకుంది. సన్యాసిరాజుపేట-రాయిందొరవలస బీటీ రహదారి నిర్మాణానికి రూ. 1.10 కోట్లు మంజూరు చేసింది. ఉపాధి నిధులతో పనులు పూర్తికావడంతో ఆ ప్రాంతవాసులకు దారి కష్టాలు తప్పాయి. దీనిపై జేఈ జి.గౌరీశంకర్ మాట్లాడుతూ.. ‘గతంలో రహదారి అధ్వానంగా ఉండేది. ఈ సమస్యను కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్ దృష్టికి గ్రామస్థులు తీసుకువెళ్లారు. నిధులు మంజూరు కావడంతో నిర్దేశించిన సమయానికి నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేశాం. మొత్తగా సన్యాసిరాజుపేట వాసుల రవాణా కష్టాలు తీరాయి.’ అని తెలిపారు.