Share News

8 నెలలు.. 152 మరణాలు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:29 AM

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు మెరుగుపడడం లేదు. రోగులకు సరైన వైద్యం అందడం లేదు.

   8 నెలలు.. 152 మరణాలు!

- ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో మెరుగుపడని సేవలు

- అత్యవసర సమయాల్లో వస్తున్న వారికి భరోసా కరువు

- సదుపాయాలు అంతంతమాత్రమే

-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీరుపై విమర్శలు

- మెంటాడ మండలం కొండపర్తి బాడవ గ్రామానికి చెందిన అంజి సీతన్నదొర అనే వృద్ధుడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు డోలి కట్టి సీతన్నదొరను కొండ దిగువకు దాటించారు. అక్కడి నుంచి 108లో గజపతినగరం సీహెచ్‌సీకి చేర్చారు. అక్కడ వైద్యులు మందులు ఇచ్చి పంపించేశారు. ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో సీతన్నదొర మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సీతన్నదొర చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

- బలిజిపేటకు చెందిన రాజా అనే బాలుడు రాజాం ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ట్రాన్సిల్స్‌ను గుర్తించారు. ఆపరేషన్‌ చేశారు. అయితే కోమాలోకి వెళ్లిపోయిన బాలుడు మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

విజయనగరం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు మెరుగుపడడం లేదు. రోగులకు సరైన వైద్యం అందడం లేదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రులు అంటే నమ్మకం సడలుతోంది. ముఖ్యంగా అత్యవసర వైద్యం అందడం లేదు. దీంతో రోగులు మృత్యువాత పడుతున్నారు. గడిచిన 8 నెలల కాలంలో ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో వైద్యానికి వచ్చి 152 మంది మృతిచెందారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో ఎనిమిది ఆస్పత్రులు ఉన్నాయి. రాజాం, గజపతినగరం, ఎస్‌.కోట, చీపురుపల్లిలో ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్‌సీలు కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో వీటిని అప్‌గ్రేడ్‌ చేసినా.. సేవలు మాత్రం పెరగలేదు. పేరుకే గైనిక్‌, పిడియాట్రిక్‌, ఎముకలు, కంటి, డెంటల్‌, జనరల్‌ సర్జరీ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కానీ, కనీసం ఓపీ సేవలు అందించలేదు. అటు ఇన్‌పేషెంట్‌ విభాగం కూడా అంతంతమాత్రమే. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తక్కువే. ప్రసవాలు, కుటుంబ నియంత్రణ చికిత్సలు కూడా లక్ష్యం మేరకు జరగలేదు. చాలా ఆస్పత్రుల్లో ఈసీజీ, ఎక్స్‌రే వంటి సేవలు కూడా సక్రమంగా అందలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

తగ్గని మరణాలు..

సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో మరణాలు చూస్తే కలచివేస్తోంది. జనవరిలో 28 మరణాలు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14, ఏప్రిల్‌లో 24, మేలో 25, జూన్‌లో 15, జూలైలో 17, ఆగస్టులో 12 మరణాలు సంభవించాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ కూడా తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల వరకూ ఓపీ లక్ష్యాలుగా నిర్దేశించారు. అందులో సగం కూడా పూర్తిచేయలేకపోయారు. ఇన్‌పేషెంట్ల విభాగం గురించి చెప్పనవసరం లేదు. ఆపరేషన్లు, ప్రసవాల టార్గెట్‌ కూడా అలానే ఉంది. అన్నింటిలోనూ వెనుకబాటే కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాధుల సీజన్‌ నడుస్తోంది. ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. అదే సమయంలో పేదలు, సామాన్యులు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వస్తున్నా.. సిబ్బంది నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో ప్రైవేటు వైద్యం వైపు వెళుతుండడంతో ఆర్థిక భారంగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు ఉన్నత చదువులు పేరిట సెలవుల్లో ఉన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి.

నిర్ధారణ పరీక్షల్లో జాప్యం..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. జ్వరం వస్తే వైద్యులు రక్త పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు. అయితే సరైన పరికరాలు లేకపోవడం, కొన్నిరకాల పరీక్షలు జరపకపోవడం, ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడం వంటి కారణాలతో చాలా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు జరగడం లేదు. దీంతో పేద, సామాన్య ప్రజలు ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. సొంత డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, స్కానింగ్‌ విభాగాలు ఉన్నా రోగులకు రకరకాల కారణాలు చెప్పి బయటకు పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం వైద్య విధాన పరిషత్‌లో ఉన్న ఈ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరిస్తే జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు,

మృతుల వివరాలు

ప్రాంతం మృతులు

రాజాం 28

బాడంగి 29

బొబ్బిలి 23

నెల్లిమర్ల 02

భోగాపురం 04

గజపతినగరం 23

ఎస్‌.కోట 33

చీపురుపల్లి 33

మొత్తం 152

స్పందన ఉండదు..

ప్రభుత్వాస్పత్రులకు వెళుతుంటే సరైన స్పందన లేదు. సేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. ఎక్స్‌రే, స్కానింగ్‌ వంటివి బయట తీసుకురమ్మంటున్నారు. రకరకాల కారణాలు చెబుతున్నారు. సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మాలాంటి వారు కష్టమైనా ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు.

- రామసింగ్‌ శ్రీను, స్థానికుడు, గజపతినగరం

మెరుగుపరుస్తున్నాం..

సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరుస్తున్నాం. వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తిచేస్తాం. ఓపీ కూడా బాగానే నమోదవుతోంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కార మార్గం చూపిస్తున్నాం. అత్యవసర సమయాల్లో వస్తున్నారు. వీలైనంతవరకు వైద్యసేవలు అందిస్తున్నాం. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది వయసు మళ్లిన వారు, అత్యవసర పరిస్థితులు, బ్యాడ్‌ కండీషన్‌లో సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులకు వచ్చినవారే. అప్పటికీ మేము మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అంతే కాకుండా సీరియస్‌గా ఉంటే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమని కుటుంబ సభ్యులకు చెబుతున్నాం. కానీ, వారు తీసుకువెళ్లక పోవడంతో మృతి చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మందికి వైద్యం చేశాం. మృతుల సంఖ్య చూసుకుంటే.. 07 శాతం మాత్రమే. అంతే కాకుండా విధుల్లో డాక్టర్లు , సిబ్బంది అలసత్వం వహిస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారించి చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ పద్మశ్రీరాణి, డీసీహెచ్‌ఎస్‌, విజయనగరం

Updated Date - Oct 03 , 2026 | 12:29 AM