Planting ఇంకా 70 శాతం నాట్లు పడలే!
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:19 AM
70% of Planting Yet to Be Completed ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపో వడంతో భామిని మండలంలో ఖరీఫ్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటికి కటకటలాడుతున్నారు. వరినాట్లు వేయలేక.. సాగు ఎలా చేపట్టాలో తెలియక తలలు పట్టుకుం టున్నారు.
చెరువులు, గెడ్డల్లో నీటి జాడ కరువు
సాగునీటికి కటకట
బోర్లు ఉన్నచోటే వరినాట్లు
వరుణుడి కరుణ కోసం రైతుల ఎదురుచూపు
భామిని, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపో వడంతో భామిని మండలంలో ఖరీఫ్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటికి కటకటలాడుతున్నారు. వరినాట్లు వేయలేక.. సాగు ఎలా చేపట్టాలో తెలియక తలలు పట్టుకుం టున్నారు. గతేడాది ఈ సమయానికి నాట్లు పూర్తవగా.. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బోర్లు ఉన్న చోటే నాట్లు వేయగా.. ఇతర ప్రాంతాల్లో వారు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా ఏటాలానే ఈ సారి కూడా మండలంలో రైతులు సుమారు పది వేల ఎకరాల్లో ఖరీఫ్ వరిసాగు చేపట్టారు. అయితే ప్రస్తుతం చెరువులు, గెడ్డల్లోకి కూడా ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీంతో సాగునీటి కోసం రైతులు బోర్లుపై ఆధారప డుతున్నారు. సాధారణంగా ఏటా జూలై రెండో వారానికే వర్షాలతో చెరువులు, గెడ్డలు నిండుతుం టాయి. అయితే ఈ ఏడాది ఆగస్టు సగం రోజులు దాటుతున్నా ఆశించిన వర్షాలు కురవలేదు. దీంతో ఎక్కడా నీటి జాడ లేకపోవడంతో ఖరీఫ్ రైతులు టెన్షన్ పడుతున్నారు. పెద్దదిమిలి, ఘనసర, దిమ్మిడిజోల, పసుకుడి, నులకజోడు తదితర గ్రామాల్లో ఆశించిన స్థాయిలో ఖరీఫ్ పనులు సాగడం లేదు. మండలంలో సుమారు 70 శాతం వరకు వరినాట్లు వేయలేదు. మరోవైపు కూలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలను ఒడిసిపట్టి పొలాల్లో నీటిని నిల్వ చేసి నాట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మం డలంలో బోర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రం రైతులు వరినాట్లును ముమ్మరం చేశారు. మండలంలో ఎక్కువగా వర్షాధార వ్యవసాయమే కావడంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పెరిగిన బోర్లు సంఖ్య..
గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మండలంలో బోర్లు సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం 1,110 వ్యవసాయ బోర్లు ఉండగా.. ఈ రెండేళ్లలో 310 వరకు పెరిగినట్టు విద్యుత్‌శాఖాధికారులు తెలియజేస్తున్నారు. బురుజోల, వడ్డంగి, నులకజోడు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బోర్లు ఏర్పాటు చేశారు. కాగా గురండి, నేరడి, కాట్రగడ, బత్తిలి, బిల్లుమడ, సింగిడి, నులకజోడు తదిరత ప్రాంతాల్లో రైతులు కొన్నాళ్లుగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకుని వరిసాగు చేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చు...
‘ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో భామిని మండలంలో రైతులు పది వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు మూడు వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. మరో ఏడు వేల ఎకరాల్లో నాట్లు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ నెలాఖరు వరకు వరినాట్లు వేసుకోవచ్చు.’ అని మండల వ్యవసాయాధికారి షేక్ ఆఫ్రీన్ తెలిపారు.