Territorial Battle 5న ప్రాదేశిక పోరు
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:15 AM
5th Territorial Battle ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో చిన్న మార్పు జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు తేదీలు మారాయి. నవంబరు 5న పోలింగ్, 7న లెక్కింపునకు తేదీలు మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
రీ షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం
పార్వతీపురం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో చిన్న మార్పు జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు తేదీలు మారాయి. నవంబరు 5న పోలింగ్, 7న లెక్కింపునకు తేదీలు మారుస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. పాత షెడ్యూల్ ప్రకారం నవంబరు 3న పోలింగ్, 5న లెక్కింపు అని తొలుత ప్రకటించారు. ఆ మేరకు ఈ నెల 23 వరకూ నామినేషన్ల దాఖలుకు, 27న ఉపసంహరణకు అవకాశమిచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 28న జరగాల్సిన మునిసిపల్ పోలింగ్ నవంబరు 1కి వాయిదాపడింది. లెక్కింపు ప్రక్రియ 3న నిర్వహించనున్నారు. అదేరోజు ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ ఇవ్వడంతో నిబంధనలకు అడ్డంకిగా మారింది. మరోవైపు ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జడ్పీటీసీ స్థానాలకు 52 మంది, ఎంపీటీసీ స్థానాలకు 534 మంది పోటీ పడుతున్నారు.
- పరిషత్ పోరకు సంబంధించి గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, గరుగుబిల్లి, కురుపాం, కొమరాడ మండలాల కౌంటింగ్ ప్రక్రియను ఉల్లిభద్రలోని హార్టికల్చర్ కాలేజ్‌లో చేపట్టనున్నారు. పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాలకు పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేటాయించారు. పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం మండలాలకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కాశాలలో ఏర్పాట్లు చేశారు. . మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన స్ర్టాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను సాలూరులోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు.