50 beds in the name... పేరుకే 50 పడకలు...
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:00 AM
50 beds in the name...
పేరుకే 50 పడకలు...
ఉన్నవి 30 పడకలే
నిత్యం రోగులతో కిటకిట
వసతులు అంతంతమాత్రమే
ఆచరణ లేని నేతల హామీలు
బొబ్బిలి కమ్యూనిటీ ఆస్పత్రి పరిస్థితి ఇది
బొబ్బిలి, జనవరి 8(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి కమ్యూనిటీ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా చేస్తున్నట్లు ప్రకటించాక అక్కడి ప్రజలు ఆపదలో ఆసరాగా ఉంటుందని భావించారు. మెరుగైన వైద్య సేవలు అందుతాయనుకున్నారు. కానీ నేటికీ పడకలు పెంచలేదు. సౌకర్యాలు అంతకంటే మెరుగు కాలేదు. బొబ్బిలి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రోగుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వారి అవసరాలకు తగ్గట్టు వసతులు లేక అవస్థలు పడుతున్నారు. పేరుకు 50 పడకల ఆసుపత్రే... వాస్తవంగా ఉండేది 30 పడకలు మాత్రమే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న నాటి నుంచి నేటి వరకు వందపడకల ఆసుత్రి కావాలని ఈ ప్రాంత నాయకులు, ప్రజలు ఎంతగా కోరుతున్నా స్థాయి పెరగలేదు. వైసీపీ హయాంలో హంగామా చేశారు కాని ఏ అభివృద్ధీ లేదు. 30 పడకలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వసతులు సరిపడక రోగులకు వరండాల్లో పడకలు వేస్తున్నారు.
- ఈ సీహెచ్‌సీ ప్రసవాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఈ ప్రాంతంవారే కాకుండా పొరుగుజిల్లాకు చెందిన బలిజిపేట, సీతానగరం, మక్కువ తదితర ప్రాంతాల నుంచి గర్భిణులు పెద్దసంఖ్యలో ఆశ్రయిస్తున్నారు. తల్లీబిడ్డల వార్డు ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది.
- ఎక్స్-రే ప్లాంటు ఉన్న గది వర్షానికి కారిపోతోంది. ఈఎన్‌టీ, ఆర్థో తదితర రోగులకు శస్త్రచికిత్సలు చేయాలంటే సీహెచ్‌సీలో ప్రత్యేకంగా థియేటర్లు లేవు. కొన్ని రకాల మందులు ప్రభుత్వం నుంచి సరఫరా కావడం లేదు. రోగులు వాటిని బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
- 50 పడకల ఆసుపత్రి నిర్వహణ కోసం పైఅంతస్తులో అదనపు భవనాలు నిర్మిస్తామని గత ప్రభుత్వ హయాం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పనులు జరగడం లేదు. ప్రతిరోజూ 300 నుంచి 400 మంది వరకు రోగులు సీహెచ్‌సీకి వస్తుంటారు.
- ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో, డీఆర్‌సీ సమావేశాల్లో, సంబంధిత మంత్రుల దృష్టిలో పెట్టినా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదు.
ఆసుపత్రి స్థాయి పెరగాల్సి ఉంది
డాక్టర్ గేదెల శశిభూషణరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్, బొబ్బిలి
బొబ్బిలి సీహెచ్‌సీ రోగులతో రద్దీగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా వందపడకల ఆసుపత్రిగా అత్యవసరంగా తీర్చిదిద్దాలి. అలా అయితే వైద్యులు, సిబ్బంది సంఖ్య రెట్టింపు అవుతుంది. వసతులు, వనరులు పెరుగుతాయి. వందపడకలకు స్థలాభావం ఉన్నప్పటికీ నూతనభవనం పైఅంతస్తులో వార్డులను ఏర్పాటు చేయవచ్చు. సర్జన్ పోస్టు, ఎంబీబీఎస్ పోస్టు, ఓటీ అసిస్టెంట్, జీడీ అటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఓపీలో కొంత ఇబ్బందిగా ఉంది. వసతి సమస్య ఉంది. పడకలు సరిపడగా లేవు. వందపడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి నివేదించాం.