Share News

5 in First Year, 4 in Second Year ఫస్టియర్‌లో 5.. సెకండియర్‌లో 4

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:29 AM

5 in First Year, 4 in Second Year ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు మెరిశారు. ఉత్తమ మార్కులతో ప్రతిభ చూపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 5,713 మంది పరీక్షలు రాయగా 4,713 మంది ఉత్తీర్ణత (82.49 శాతం)సాధించారు. దీంతో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,879 మంది హాజరవగా 5,097 మంది విద్యార్థులు (87 శాతం)పాస్‌ అవ్వడంతో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.

5 in First Year, 4 in Second Year ఫస్టియర్‌లో 5.. సెకండియర్‌లో 4
విద్యార్థులు, అధ్యాపకులను అభినందిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • ద్వితీయ సంవత్సరంలో నాలుగో స్థానం

  • సత్తాచాటిన మన్యం విద్యార్థులు

పార్వతీపురం/బెలగాం, ఏప్రిల్‌15(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు మెరిశారు. ఉత్తమ మార్కులతో ప్రతిభ చూపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 5,713 మంది పరీక్షలు రాయగా 4,713 మంది ఉత్తీర్ణత (82.49 శాతం)సాధించారు. దీంతో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,879 మంది హాజరవగా 5,097 మంది విద్యార్థులు (87 శాతం)పాస్‌ అవ్వడంతో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. కురుపాం , మక్కువ, సీతానగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కాగా గత ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. రెండో సంవత్సరంలో 86 శాతం ఉత్తీర్ణతతో మన్యం జిల్లా ఏడోస్థానం దక్కించుకుంది. 2024లో రాష్ట్రంలో జనరల్‌ కోర్సుల ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం లభించింది. అదే ఏడాదిలో మొదటి సంవత్సరానికి సంబంధించి జనరల్‌ గ్రూప్‌లో 1761 మంది పరీక్షలు రాయగా 934 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ గ్రూప్‌లకు సంబంధించి 737 మంది పరీక్షలు రాయగా 52 మంది పాసయ్యారు. ఇంటర్‌ రెండో సంవత్సరం సంబంధించి అదే సంవత్సరంలో 1717 మంది పరీక్షలకు హాజరుకాగా 1169 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో ఒకేషనల్‌ గ్రూప్‌లకు సంబంధించి 618 మంది పరీక్షలకు హాజరుకాగా 48 మంది హాజరయ్యారు.

విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు

ఉత్తమ ఫలితాలు సాధించిన ఇంటర్‌ విద్యార్థులతో పాటు డీఐఈవో నాగేశ్వరరావు, అధ్యాపకులను కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి అభినందించారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్‌ ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లా మరింత ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. మార్కులు తక్కువ వచ్చిన వారు అధైర్యపడకుండా త్వరలో జరిగే సప్లమెంటరీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్‌ తర్వాత ఏం చదవాలి.. ఏ కోర్సు తీసుకోవాలనే అంశాలపై కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శతశాతం ఉత్తీర్ణత..

- సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బొడ్డవలస బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం శతశాతం ఫలితాలను సాధించింది. ఈ గురుకులం నుంచి ప్రథమ ఏడాదికి 39 మంది పరీక్షలు రాయగా 39 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాదికి 48 మంది పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణత సాధించారు.

- మక్కువ రూరల్‌: కాశీపట్నం కేజీబీవీలో ఇంటర్‌ రెండో సంవత్సరంలో 34మంది, మొదటి సంవత్సరంలో 35మంది పరీక్షలకు హాజరుకాగా వారంతా ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్‌ జి.దుర్గ తెలిపారు. ములక్కాయవలసలో ఆదర్శ పాఠశాలలో రెండో సంవత్సరం 84 మంది, మొదటి సంవత్సరం 101మంది పాసైనట్లు ప్రిన్సిపాల్‌ స్వర్ణలత తెలిపారు.

-కురుపాం: కురుపాం కేజీబీవీ చెందిన ఇంటర్‌ రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 37 మంది పరీక్ష రాసి, అందరూ పాసయ్యారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఎంపీసీ 41 మంది, బైసీపీ 34 మంది పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణులయ్యారు.

-గుమ్మలక్ష్మీపురం: భద్రగిరి ఎస్టీ జూనియర్‌ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 116 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారంతా పాసయ్యారు. రెండో సంవ త్సరంలో 119 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. పీటీజీ బాలికల గురుకుల పాఠశాలలో రెండో సంవత్సరంలో 133 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారంతా పాసయ్యారు.

- సీతానగరం: జోగింపేట స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ విద్యాలయంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 44 మంది, బైపీసీలో 36 మంది ఉత్తీర్ణత సాధించారు. జోగింపేట కేజీబీవీలో ఎంపీసీ గ్రూపులో ద్వితీయ సంవత్సరంలో 44 మంది, బైపీసీలో 36 మంది శత శాతం ఉత్తీర్ణత సాధించారు.

- గరుగుబిల్లి: గరుగుబిల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలకు సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో 67 మంది విద్యార్థినులు హాజరుకాగా వారంతా ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 74 మంది కూడా పాసయ్యారు. రావివలస కేజీబీవీలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 41 మంది, ద్వితీయ సంవత్సరంలో 40 మంది శతశాతం ఉత్తీర్ణత సాధించారు.

- వీరఘట్టం: రేగులపాడు కేజీబీవీలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 28మంది విద్యార్థినులు, ద్వితీయ సంవత్సరంలో 29 మంది విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు.

- కొమరాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులు 132 మంది పరీక్షలకు హాజరుకాగా వారంతా ఉత్తీర్ణత సాధించారు. అదే కళాశాలలో ఒకేషనల్‌ విభాగంలో మొదటి సంవత్సరంలో 17 మంది, రెండో సంవత్సరంలో 13 మంది విద్యార్థులంతా పాసయ్యారు.

Updated Date - Apr 16 , 2026 | 12:29 AM