పింఛన్లకు 49,572 దరఖాస్తులు
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:21 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 49,572 దరఖాస్తులు వచ్చాయి.
- ముగిసిన స్వీకరణ
-ఎస్టీ ధ్రువపత్రాలు మంజూరుకాక దూరమైన అర్హులు
విజయనగరం కలెక్టరేట్ ,సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 49,572 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో దరఖాస్తులు స్వీకరణ ముగియడంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఈనెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. దివ్యాంగులు, వృద్ధులు, చేనేత కార్మికులు, మత్య్సకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, వితంతులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సంబంధిత శాఖలకు పంపించారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల్లో 130 తిరష్కరణకు గురైనట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఎస్టీ కులాలకు సంబంధించి ధ్రువపత్రాలు మంజూరు కాకపోవడంతో, అర్హత ఉన్న చాలా మంది గిరిజనులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ ధ్రువపత్రాలను తహసీల్దార్ స్థాయిలో కాకుండా ఆర్డీవోలు మంజూరు చేయాల్సి ఉంది. వీటికోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తరువాత రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సమస్య రావడంతో ధ్రువపత్రాలు మంజూరు కావడం లేదు. దీంతో వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామానికి చెందిన పలువురు అర్హులు దరఖాస్తు చేసుకోలేపోయారు. దీనిపై జిల్లా స్వర్ణ వార్డు, గ్రామ కోఆర్డినేటర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సమస్య ఉందని, అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచించినట్లు వెల్లడించారు.