4320 people are eligible అర్హులుగా 4320 మంది
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:47 AM
4320 people are eligible సముద్రంలో వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందజేసే మత్స్యకారుల సేవలో పథకానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అర్హులుగా 4320 మందిని ప్రాథమికంగా గుర్తించారు. వారి జాబితాను ఆన్‌లైన్ చేయనున్నారు.
అర్హులుగా 4320 మంది
మత్స్యకారుల సేవలో పథకంపై సర్వే కొలిక్కి
భోగాపురం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): సముద్రంలో వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందజేసే మత్స్యకారుల సేవలో పథకానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అర్హులుగా 4320 మందిని ప్రాథమికంగా గుర్తించారు. వారి జాబితాను ఆన్‌లైన్ చేయనున్నారు. చేపల ఉత్పత్తి సమయంగా పరిగణిస్తూ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మర పడవలతో ఎవరూ చేపల వేట చేయకూడదు. అయితే మత్స్యకారుల జీవనాధారం చేపలవేటే కావడంతో వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అర్హులైన మత్స్యకారులకు మత్స్యకారుల సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20వేలు అందజేస్తోంది. గత ప్రభుత్వం వేట నిషేధ సమయంలో రూ.10వేలు మాత్రమే ఇచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెట్టింపు చేసి రూ.20వేలు అందజేస్తోంది. కాగా మత్స్యకారుల సేవలో పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు అధికారులు భోగాపురం, పూససాటిరేగ మండలాల్లో తీరంలో ఉంచిన పడవలను గణన చేశారు. రెండు మండలాల్లో 639 ఇంజన్ పడవలు, 300 సాంప్రదాయక పడవలను గుర్తించి నమోదు చేశారు. అలాగే 939 పడవల ద్వారా జీవనాధారం కోసం వేట సాగిస్తున్న 4320 మంది మత్స్యకారులను గుర్తించి వారి నుంచి ఆధార్, ఫోన్ నెంబరు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకొన్నారు. అయితే అన్ని వివరాలు ఆన్‌లైన్ చేయనున్నారు. ఆన్‌లైన్ తరువాత మత్స్యకారుల సేవలో పథకానికి అర్హులను నిర్ధారిస్తారు. దీనిపై మత్స్యశాఖ ఎఫ్‌డివో శ్రీనివాసరావును వివరణ కోరగా మత్స్యకారుల సేవలో పథకానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పడవలు, మత్స్యకారుల వివరాలు సేకరించామన్నారు. అన్ని వివరాలను ఆన్‌లైన్ చేయనున్నామని, తదుపరి అర్హుల జాబితా ప్రకటించనున్నామని తెలిపారు.