30 Kilos for ₹50 30 కిలోలు రూ.50
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:38 PM
30 Kilos for ₹50 టమాటా ధర మరింత పతనమైంది. శుక్రవారం సాలూరు మార్కెట్‌లో 30 కిలోల టమాటా కేట్ ధర రూ.50 పలికింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఆవేదనలో రైతులు
సాలూరు రూరల్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): టమాటా ధర మరింత పతనమైంది. శుక్రవారం సాలూరు మార్కెట్‌లో 30 కిలోల టమాటా కేట్ ధర రూ.50 పలికింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాలూరు నియోజకవర్గం దుగ్ధసాగరం, చినబోరబంద, పెదబోరబంద, కూర్మరాజుపేట, మోసూరు, మాతుమూరు, పాంచాళి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో టమాటా సాగవుతుంది. గత నెల తొలివారం వరకు ధర ఫర్వాలేదనిపించింది. రెండో వారం నుంచి ధర పతనమైంది. తొలుత 30 కిలోల కేట్ రూ.120 వరకు ధర పలికేది. దిగుబడులు పెరగడంతో రానురాను ధర మరింత తగ్గుతూ వస్తోంది. కాగా అతితక్కువ ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ప్రజలకు మాత్రం కిలో టమాటాను రూ.8 నుంచి రూ.10కు విక్రయిస్తున్నారు. మొత్తంగా గిట్టుబాటు ధర రాక.. పంటను నిల్వ చేసుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట సేకరణ , కూలీలు, రవాణాకు వెచ్చించిన పెట్టుబడి సైతం రావడం లేదని వారు వాపోతున్నారు. మార్కెటింగ్‌శాఖాధికారులు సాలూరులో విక్రయాలను పరిశీలించి రైతు బజారులో అమ్ముకోవాలని సలహా ఇచ్చారు. అయితే వీధిల్లో తిరిగినా అమ్ముడుపోని టమాటాలు రైతుబజారులో కూర్చుంటే ఎలా చెల్లుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధర స్థిరీకరణకు తగిన కార్యాచరణ చేయాలని వారు కోరుతున్నారు. ‘ టమాటా ధర తగ్గినప్పుడు వాటికి విలువ పెంచేలా వాల్యూయాడెడ్ ఉత్పత్తుల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తాం. టమాటాలతో పచ్చళ్లు తదితరఇతర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తే గిట్టుబాటు ధర వచ్చే అవకాశముంది. దీనిపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. మార్కెట్ చేయడానికి రైతులు కూడా ఆసక్తి కనబర్చాలి. ’ అని ఇన్‌చార్జి హర్టికల్చర్ అధికారి ప్రత్యూష తెలిపారు.