Share News

287 Sanctioned, Only 26 Works మంజూరు 287.. పనులు 26

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:36 AM

287 Sanctioned, Only 26 Works Taken Up గిరిపుత్రులకు డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు మంజూరు చేసిన రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు. పలు కారణాలతో నిర్మాణాలకు నోచుకోవడం లేదు.

287 Sanctioned, Only 26 Works   మంజూరు 287.. పనులు 26
గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి రోడ్డు ఇలా..

  • పనులు పూర్తయ్యేదెప్పుడు?

పార్వతీపురం, జనవరి25(ఆంధ్రజ్యోతి): గిరిపుత్రులకు డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు మంజూరు చేసిన రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు. పలు కారణాలతో నిర్మాణాలకు నోచుకోవడం లేదు. వాస్తవవంగా జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 287 రహదారుల పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు సుమారు 109 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటివరకు 26 రోడ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించారు. మిగిలిన రహదారులు నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభిస్తారో .. ఇంకెప్పటికి పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. గుమ్మలక్ష్మీపురం మండలంలో 93, జియ్యమ్మవలసలో ఏడు కొమరాడ 67, కురుపాం 37, మక్కువ 10, పాచిపెంట 28, పార్వతీపురం 11, సాలూరు 22, సీతంపేట మండలంలో 12 రహదారులు నిర్మించాల్సి ఉంది. ఇందులో గుమ్మలక్ష్మీపురంలో మండలంలో 19, కొమరాడలో ఐదు, కురుపాం మండలంలో రెండు రహదారులు నిర్మాణాలకు మాత్రమే శ్రీకారం చుట్టారు. మిగిలిన వాటి నిర్మాణాలకు సంబంధించి నేటివరకు అడుగులు పడలేదు. మొత్తంగా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

- ఉపాధి హామీ పథకం ద్వారా రహదారుల నిర్మాణాలు చేపట్టాలంటే ఇదే చివరి అవకాశం. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటా ప్రాతిపదికన ఈ రహదారులను నిర్మించారు. అయితే రానున్న రోజుల్లో అలా కుదరదు. ‘ఉపాధి’లో రహదారుల నిర్మాణాలకు కేంద్రం 60 శాతం నిధులను మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిధులు మంజూరు ప్రాప్తికి సంబంధించి త్వరితగతిన రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది.

- కేంద్ర ప్రభుత్వం మార్చిన నిబంధనల ప్రకారం.. ఒక రహదారి నిర్మాణానికి కేవలం రూ.50 లక్షల లోపు మాత్రమే ఉపాధి మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను వినియోగించాల్సి ఉంది. అంతకుమించితే నిధులు మంజూరు కావు. ఇప్పటికే ఒక రహదారి నిర్మాణాన్ని మూడు నుంచి నాలుగు రీచ్‌లుగా విభజించి బిల్లులు పెడుతున్నారు. కాగా మెటీరియల్‌ కాంపోనెంట్‌తో మంజూరైన రహదారుల నిర్మాణాలు ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. లేకుంటే సకాలంలో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉండదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలు మారుతుండడంతో ఇప్పటికే మంజూరైన రహదారుల నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

- అటవీశాఖ అభ్యంతరాల కారణంగానే జిల్లాలోని కొన్ని గిరి శిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు ముందుకు సాగడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. త్వరితగతిన పనులు ప్రారంభించాలని మరోవైపు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అనేక సమావేశాల్లో ఆదేశిస్తున్నా.. ఇంజనీరింగ్‌ శాఖలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకు సాగడం లేదు.

- ప్రస్తుతం గిరిశిఖర గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలకు కొంతమంది కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు చెల్లింపులపై సందేహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వివిధ ఇంజనీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన సుమారు రూ.30 కోట్ల విలువైన పనులకు గత ఏడాది మార్చి నుంచి బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. దీంతో చాలామంది కాంట్రాక్టర్లు రహదారుల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు.

పనులు ప్రారంభిస్తాం

‘అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే పార్వతీపురం డివిజన్‌ పరిధిలో గిరి శిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణాలను ప్రారంభిస్తాం. ఇప్పటికే కొన్నిచోట్ల రోడ్ల నిర్మాణాలు ప్రారంభించాం. ’ అని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నగేష్‌ తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 12:36 AM