28 తులాల బంగారం స్వాధీనం
ABN , Publish Date - May 21 , 2026 | 11:53 PM
మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధిలోగల గొల్లపేటలో ఈనెల 17వ తేదీన 28 తులాల బంగారం చోరీకి గురైన విషయం విధితమే.
చోరీ కేసును మూడు రోజుల్లో ఛేదించిన పోలీసులు
పూసపాటిరేగ, మే 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధిలోగల గొల్లపేటలో ఈనెల 17వ తేదీన 28 తులాల బంగారం చోరీకి గురైన విషయం విధితమే. ఈ కేసును స్థానిక పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. ఈ ఘటనపై భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ స్థానిక విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 17న గొల్లపేటలో రీసు రాజు అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ జరిగిన వెంటనే భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, స్థానిక ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లతో పాటు పోలీసు యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన రోజున గ్రామం నుంచి బయటకు వెళ్లిన వారి డేటాతోపాటు, ఆ రోజు గ్రామంలో అనుమానాస్పందంగా ఉన్నవారి సెల్‌ఫోన్లను ట్రేక్ చేశారు. తర్వాత రోజున సుమారు 20మంది చేతివేళ్ల నమూనాలు సేకరించారు. చోరీ జరిగిన రోజున సేకరించిన చేతివేళ్ల నమూనాలు వీటికి సరిపడ్డాయి. అలాగే సెల్‌ఫోన్ ట్రేక్ చేసిన డేటాలతో పాటు మరికొన్ని సరిపడటంతో అనుమానితుడైన అదే గ్రామానికి చెందిన మాతికమాని అప్పలనాయుడుపై పోలీసులు నిఘా ఉంచారు. చోరీ చేసిన బంగారాన్ని అమ్మడానికి విజయనగరం వెళ్లేందుకు యాతపేట జంక్షన్ వద్ద ఉన్న అప్పలనాయుడును పోలీ సులు మాటువేసి, పట్టుకున్నారు. ఈ చోరీకి సహాయం చేసిన పీత సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 28 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు.