Share News

తలసరి ఆదాయంలో 25వ స్థానం

ABN , Publish Date - May 08 , 2026 | 12:47 AM

ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పట్టే తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

తలసరి ఆదాయంలో 25వ స్థానం

- వ్యవసాయంలో 27, పారిశ్రామిక రంగంలో 20

- జలధార, స్కిల్‌ సెన్స్‌ల్లో రెండో స్థానం

- ఇవీ జిల్లా గణాంకాలు

- కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన ప్రభుత్వం

- పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

- కలెక్టర్ల చిత్తశుద్ధితో పనిచేయాలన్న సీఎం

పార్వతీపురం, మే 7 (ఆంరఽధజ్యోతి): ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పట్టే తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతికి సంబంధించిన పలు గణాంకాలను వెల్లడించారు. తలసరి ఆదాయంలో 25వ స్థానం, వ్యవసాయ ఆదాయంలో 27, పారిశ్రామిక ఆదాయంలో 20వ స్థానంలో నిలిచింది. జీడీపీ (2025-26)లో జిల్లా ఆదాయం రూ.17,262 కోట్లతో 7.39 శాతం వృద్ధి సాధించింది. అయితే జిల్లాలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గత ఏడాది వలనే జిల్లా 27వ స్థానంలో నిలిచింది. 2026-27లో జిల్లా ఆదాయం రూ.19,778 కోట్లు లక్ష్యంగా పెట్టుకొని, 14.57 శాతం వృద్ధి చెందాలని నిర్ణయించారు. 2026-27లో తలసరి ఆదాయం రూ.1,79,294 లక్ష్యం కాగా, 14.29శాతం వృద్ధి సాధించాలని నిర్ణయించారు. ఎగ్రీ ఎలాయిడ్‌ సెక్టార్‌లో రూ.6,448 కోట్ల ఆదాయంతో 27వ స్థానంలో నిలిచింది. 2026-27లో ఈ సెక్టార్‌ ద్వారా రూ.7,180 కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశ్రామిక రంగంలో జిల్లా ఆదాయం రూ.2,038 కోట్లతో 26వ స్థానం, సేవారంగంలో రూ.9,015 కోట్ల ఆదాయంతో 26వ స్థానం, కేపీఐ నైపుణ్యంలో 83 శాతంతో 20 స్థానం సాధించింది. జలధార కార్యక్రమంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానం పొందింది. జిల్లాలో 7,996 పనులను గుర్తించగా, 7446 పనులు మంజూరు చేశారు. ఇందులో 1,728 పనులు జరుగుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి సెన్స్‌లో, ఏపీఏఐఎంఎస్‌ నమోదులో 2వ స్థానాన్ని దక్కించుకుంది. పీఎం కిసాన్‌ కాంపౌనెండ్స్‌ అమలులో, పీఎం సూర్యాఘర్‌ అమలులో 10వ స్థానం లభించగా, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లాకు 26వ స్థానంలో నిలిచింది. పదో తరగతి ఫలితాల్లో 96.07 శాతంతో మొదటి స్థానం, ఇంటర్‌ మొదటి సంవత్సర ఫలితాల్లో 5వ స్థానం, రెండో సంవత్సరంలో 4వ స్థానం సాధించడంపై ముఖ్యమంత్రి.. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని అభినందించారు. గ్రౌండ్‌ వాటర్‌ స్థాయిలో జిల్లా 16వ స్థానంలో ఉంది.

పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

జిల్లాలో పర్యాటకాభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌లో భాగమైనప్పటికీ జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు ఇంకా రాకపోవడంతో అదనపు ప్రోత్సాహం అవసరమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో 7.42 శాతం వృద్ధిరేటు సాధించామని, జిల్లా అగ్రికల్చర్‌ రూరల్‌ ట్రాన్స్‌ఫార్మరేటివ్‌ ప్లాన్‌ కింద ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ముఖ్యమంత్రి సందర్శిస్తే మరింత ప్రాచుర్యం లభిస్తుందని అన్నారు. జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్‌ వివరించారు.

అంకితభావంతో పనిచేయాలి

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కలెక్టర్ల చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పాలనను మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసేందుకు పది సూత్రాల అజెండాను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాల్లో పెండిగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:47 AM