25th per capita తలసరిలో 25వ స్థానం
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:08 AM
25th per capita జిల్లా ఇంకా వెనకబాటు ముద్ర నుంచి బయటపడలేదు. చాలా అంశాల్లో మిగతా జిల్లాల కంటే వెనుకంజలో ఉంది. తలసరి ఆదాయంలో ఆఖరులో ఉండగా పారిశ్రామిక రంగంలో తిరోగమన స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. విద్యారంగంలో కాస్త ముందంజలో ఉండగా వ్యవసాయం రంగంలో పర్వాలేదనిపించింది.
తలసరిలో 25వ స్థానం
పారిశ్రామికరంగంలో తిరోగమనం
విద్యా రంగంలో కాస్త ముందంజ
వ్యవసాయ రంగంలో పర్వాలేదు
స్వర్ణాంధ్ర -2047తో పుంజుకునే లక్ష్యం
జిల్లా ఇంకా వెనకబాటు ముద్ర నుంచి బయటపడలేదు. చాలా అంశాల్లో మిగతా జిల్లాల కంటే వెనుకంజలో ఉంది. తలసరి ఆదాయంలో ఆఖరులో ఉండగా పారిశ్రామిక రంగంలో తిరోగమన స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. విద్యారంగంలో కాస్త ముందంజలో ఉండగా వ్యవసాయం రంగంలో పర్వాలేదనిపించింది. ఈ అంశాలన్నింటినీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సోమవారం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అడుగులు వేస్తున్న ‘స్వర్ణాంధ్ర - 2047’ లక్ష్య సాధనలో విజయనగరం జిల్లా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అందుకోసం మెరుగుపడాలని సూచించారు.
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత ఆదాయంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున 25వ స్థానంలో ఉన్నట్లు తాజాగా ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేయడం విని జిల్లా వాసులు విస్తుపోయారు. ఇంకా చాలా అంశాలు మెరుగుపడాల్సి ఉంది. అమరావతిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 3వ మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వెల్లడించిన నివేదికలో జిల్లా ఆర్థిక పరిస్థితి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
- తలసరి ఆదాయం : 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లా తలసరి ఆదాయం రూ. 1,75,856 మాత్రమే. దీంతో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా 25వ ర్యాంకులో నిలిచింది. 2025-26 నాటికి ఇది రూ.1,94,660కు పెరుగుతుందని అంచనా వేసినా..ర్యాంకింగ్ పరంగా 28వ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో.. 25 నుంచి ఏకంగా ర్యాంకింగ్ మూడు స్థానాలకు పడిపోయింది. జిల్లా వృద్ధి 9.48శాతం వద్ద ఉంది.
- పారిశ్రామిక పతనం : ఆదాయంలో వెనుకబాటుతో పాటు పారిశ్రామిక రంగంలో అదే స్థాయిలో పతనం కనిపిస్తోంది.. 2024-25లో 13.50 శాతం వృద్ధి నమోదు కాగా, వచ్చే ఏడాదికి అది 7.75 శాతానికి పడిపోతుందని నివేదిక తేల్చింది.
- వ్యవసాయం డీలా : వ్యవసాయ రంగం కాస్తా పర్వాలేదు. 2025-26 అంచనాల ప్రకారం రూ.12,545 కోట్ల ఆదాయం రాగా, వృద్ధి రేటు గత ఏడాది 6.35 శాతం నమోదైంది. ఈ సంవత్సరంలో 6.53 శాతానికి చేరింది. అయితే పనితీరు సూచికల్లో (కేపీఐ) మాత్రం 78 స్కోరుతో జిల్లా 24వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని ప్రత్తి పంట తప్పా మిగితా పంటలు తక్కువగా ఉన్నాయి. మల్బరీ కోకూన్ ఉత్పత్తి వల్ల ఇతర పంటల స్కోర్ తగ్గింది.
- సేవా రంగంలోనూ 11.99 శాతం వృద్ధి రేటుతో నిలకడగా ఉంది. రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కాస్త సంతృప్తికర స్థితిలో అమలవుతున్నాయి. పీఎంకేవీవై కింద 720 యూనిట్లు సాధించారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి 7270 మంది లక్ష్యం కాగా 6,976 మందికి వర్తింపజేశారు. డీడీయుజీవై పథకం విషయానికి వచ్చేసరికి 273 లక్ష్యం కాగా 210 మంది సాఽధించారు.
- బంగారు కుటుంబాలను గుర్తించడంలో జిల్లా 11 స్థానంలో నిలిచింది. 82,416 కుటుంబాలను గుర్తించింది. వారిని దత్తత తీసుకునేందుకు 5,424 మందిని గుర్తించగలిగింది. గ్రామ వార్డు సచివాలయం ద్వారా 6.58 శాతం దత్తత తీసుకున్నారు.
- ఇంటర్ ఫలితాలు : సంకల్ప్ ప్రీ-ఫైనల్ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఫస్టియర్ (69.48 శాతం), సెకండియర్ (7.6.53 శాతం) ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిలిచారు.
- వంశధార-నాగావళి అనుసంధానం ప్రక్రియ 73 శాతం పూర్తికాగా.. వచ్చే ఏడాది జూన్ నాటికి మిగతా 27 శాతం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాగావళి-చంపావతి నదులకు సంబంధించి 19 శాతం పనులు పూర్తికాగా.. మిగతా 81 శాతాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని టార్గెట్ విధించారు.
- జిల్లాలో నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి 84 కిలోమీటర్లకుగాను.. ఇంకా 42.83 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భూపరిహారానికిగాను 83.91 హెక్టార్లు సేకరించాల్సి ఉంది.
- రైల్వే లెవల్ క్రాషింగ్‌లకు సంబంధించి 15 ఆర్‌వోబీలు మంజూరయ్యాయి. త్వరలో 17 ఆర్‌వోబీలు మంజూరుకానున్నాయి. మొత్తం 32 చోట్ల వీటిని నిర్మించనున్నారు.
ప్రభుత్వ పెద్దల కీలక ఆదేశాలు..
ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలన్న కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మంచి వైద్యం, ఉత్తమ విద్యాసేవలు, పౌష్టికాహారం, జనాభా నిర్వహణ, మాతాశిశు మరణాల నియంత్రణ వంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఎటువంటి వైద్యం అయినా ఇంటి వద్దకే అందించేందుకు నిర్ణయించింది. జూన్ నాటికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించి సమగ్ర వైద్యసేవలు అందించాలని భావిస్తోంది. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయా శాఖల విభాగాధిపతులు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలుగా తీసుకొని చేపట్టబోయే పనులు అమలుచేస్తే జిల్లా ప్రజలకు ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. తద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర నిఽధులను పూర్తిగా ఖర్చు చేయాలి
సీఎం చంద్రబాబు నాయుడు
విజయనగరం జిల్లా ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఈ ఏడాది కేటాయించిన నిధులను మార్చిలోగా పూర్తిగా ఖర్చు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నన్స్‌పై ప్రజలుకు తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను వారే పరిష్కరించాలన్నారు. తద్వారా తలసరి ఆదాయం, ప్రజలు జీవన ప్రమాణాలకు ప్రతికగా జిల్లా నిలుస్తుందని, ప్రతి ఐదేళ్లకూ జీడీడీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు. పీ4 అనేది రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించే కార్యక్రమమని, పేదకుటుంబాలను ఆదుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టరు రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, జేసీ సేతు మాధవన్, సీపీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
---------------