22ఏ భూములకు మోక్షం!
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:42 PM
జిల్లాలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
- పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
- పరిశీలనకు ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్ల నియామకం
- పది రోజుల్లో ప్రక్రియ పూర్తికి ఆదేశం
విజయనగరం కలెక్టరేట్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న 22ఏ దరఖాస్తులపై ఆయన దృష్టి పెట్టారు. ఈ దరఖాస్తుల పరిశీలనకు ఐదుగురు డిప్యూటీ తహశీల్దార్లను నియమించారు. పది రోజుల్లో పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో త్వరలో 22ఏ భూములకు మోక్షం లభించనుంది. 1908 భూ చట్టం ప్రకారం అమ్మడానికి వీలు లేని డి.పట్టా, గిరిజన, ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు, అసైన్డ్ భూములను 2007లో అప్పటి ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చింది. ఈ భూముల జాబితాను 2013, 2015, 2017 సంవత్సరాల్లో అప్పటి తహసీల్దార్లు ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపించారు. ఈ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదని పొందపరిచారు. అయితే, ప్రస్తుతం ఈ భూముల ధరలు పెరగడంతో నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించాలంటూ సంబంధిత రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దరఖాస్తులు దాదాపు 120 వరకు అధికారులకు అందాయి. ఇవి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం రైతులు రెవెన్యూ అఽధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ దరఖాస్తులను మండల రెవెన్యూ అధికారులు పరిశీలించి తహసీల్దార్ లాగిన్ ద్వారా ఆర్డీవోకి పంపించారు. అక్కడ నుంచి కలెక్టరేట్‌లోని ఈ-సెక్షన్‌కు వచ్చాయి. ఇప్పుడు ఈ-సెక్షన్‌లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. రికార్డులు అన్ని సక్రమంగా ఉంటే జేసీ ద్వారా కలెక్టర్‌కు చేరవేస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. ఏది ఏమైనా పెండింగ్‌లో ఉన్న 22ఏ దరఖాస్తులను పరిశీలిస్తుండడంతో భూ సమస్యలకు కొంత వరకు మోక్షం కలగనుంది.