Share News

210 Sanctioned, Only 32 Completed మంజూరు 210.. పూర్తయినవి 32

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:31 AM

210 Sanctioned, Only 32 Completed జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రహదారుల పనులు అర్ధాంతంగా నిలిచాయి. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు తారు సరఫరా కూడా నిలిచిపోయింది.

210 Sanctioned, Only 32 Completed  మంజూరు 210.. పూర్తయినవి 32
మరుపెంట నుంచి సాంబన్నవలసకు వెళ్లే బీటీ రహదారి ఇలా..

  • నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలే కారణం

  • తారు సరఫరాకు బ్రేక్‌..

  • చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

  • పలుచోట్ల నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు

  • తూతూమంత్రంగానే తనిఖీలు

గరుగుబిల్లి, జూన్‌19(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రహదారుల పనులు అర్ధాంతంగా నిలిచాయి. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణం. మరోవైపు తారు సరఫరా కూడా నిలిచిపోయింది. వాస్తవంగా కొద్దిరోజుల కిందట కిలో తారు ధర రూ. 9.50 ఉండగా, ప్రస్తుతం రూ.96కు చేరింది. దీంతో కిలో మీటరుకు రూ.6 లక్షలకు పైగా అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో సంబంధిత కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా వెట్‌ మిక్స్‌ పనులు పూర్తయిన చోట తారు వేయకపోవడంతో రాళ్లు తేలి రహదారులు అధ్వానంగా మారాయి. రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇదీ పరిస్థితి..

ఉపాధి హామీ నిధులతో బీటీ రహదారి పనులు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. అయితే నిర్దేశిత గడువు ప్రకారం మార్చి నెలాఖరుకు నిర్మాణాలు పూర్తి కావల్సి ఉంది. జిల్లాకు మొత్తంగా 210 బీటీ రహదారులు మంజూరు కాగా, ఇప్పటివరకు 32 రోడ్ల పనులే పూర్తయ్యాయి. మరో 133 రహదారుల పనులు పలు దశల్లో ఉన్నాయి. ప్రారంభం కాని 43కు పైగా ఉన్నాయి. దీంతో నిర్మా ణాలకు ఈ నెలాఖరు వరకు గడువు పెంచారు. మొత్తంగా రోడ్ల నిర్మాణాలకు రూ.83.39 లక్షలు మంజూరయ్యాయి. 104.96 కిలో మీటర్ల పనులకు రూ. 25.54 లక్షల వరకు చెల్లింపులు జరిగాయి.

పనులు ఇలా..

-పార్వతీపురం పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజన్‌కు సంబంధించి 73 బీటీ రహదారులకు 19 పూర్తయ్యాయి. 46 రహదారుల నిర్మాణాలు పలు దశల్లో ఉండగా, ఏడు రహదారుల పనులు ప్రారంభం కాలేదు.

- సాలూరు పరిధిలో ఎనిమిది రహదారులకు రెండే పూర్తయ్యాయి. నాలుగు రహదారుల పనులు పలు దశల్లో ఉన్నాయి. మరో నాలుగు రోడ్ల పనులు ప్రారంభం కాలేదు.

- కురుపాంలో 80 రహదారులకు మూడే పూర్తయ్యాయి. 48 రహదారుల నిర్మాణాలు పలు దశల్లో ఉండగా, 29 ప్రారంభం కాలేదు. కురుపాం సెక్షన్‌-2లో 29 పనులకు గాను నాలుగు పూర్తయ్యాయి. 21 పలు దశల్లో ఉన్నాయి. మరో నాలుగు ప్రారంభం కాలేదు.

- పాలకొండ సబ్‌ డివిజన్‌కు సంబంధించి 20 రహదారులకు నాలుగు పూర్తయ్యాయి. 14 పలు దశల్లో ఉన్నాయి. ఒక రహదారి పని ప్రారంభం కాలేదు.

పనుల్లో నాణ్యతా లోపాలు

ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న బీటీ రహదారుల పనుల్లో అధికంగా నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు రహదారిని శుభ్రపర్చిన తర్వాత వెట్‌ మిక్స్‌ వేయాలి. ఆ తర్వాత వాటరింగ్‌ నిర్వహించాలి. ఒక లేయర్‌ వెట్‌ మిక్స్‌ వేసి పూర్తిస్థాయిలో రోలింగ్‌ నిర్వహించిన అనంతరం మరో వరుస వేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఇవేవీ జరగడం లేదు. వెట్‌ మిక్స్‌ వేసిన కొద్ది రోజులకే మెటల్‌ తేలిపోతుండగా... రహదారుల మధ్యలో మట్టి అధికంగా దర్శనమిస్తుంది. దీంతో స్థానికులు రోడ్ల పనులపై పెదవి విరుస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం..

నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో జిల్లా పరిధిలో బీటీ రహదారుల పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. అనుమతులు రాగానే రహదారుల పనలు చేపడతాం. కొన్నిచోట్ల రహదారుల దుస్థితిపై వినతులు అందుతున్నాయి. నాణ్యతా లోపాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం. లోపాలు బయటపడితే చెల్లింపులను నిలిపేస్తాం.

డబ్ల్యూవీఎస్‌ఎస్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, పార్వతీపురం

Updated Date - Jun 20 , 2026 | 12:31 AM