Share News

Proposal ఆ ప్రతిపాదనలకు 18 ఏళ్లు

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:22 AM

18 Years Since the Proposal జిల్లాకేంద్రంలో భూగర్భ కాలువల ఏర్పాటు కలగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. ఈ ప్రతిపాదలనకు మోక్షం లభించడం లేదు. ఫలితంగా పార్వతీపురం పట్టణవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. వర్షం పడితే చాలు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. శివారు ప్రాంతవాసులైతే రోజుల తరబడి వరదనీటిలోనే ఉండాల్సిన దుస్థితి.

  Proposal  ఆ ప్రతిపాదనలకు 18 ఏళ్లు
దేవీనగర్‌ శివారులో నివాసాల మధ్య నిలిచిన మురుగు, వర్షపునీరు

  • జిల్లాకేంద్రవాసులకు తప్పని కష్టాలు

  • వర్షం కురిస్తే తప్పని ముంపు సమస్య

  • మున్సిపల్‌ నూతన పాలకవర్గం చొరవ చూపాలని విన్నపం

పార్వతీపురం టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో భూగర్భ కాలువల ఏర్పాటు కలగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. ఈ ప్రతిపాదలనకు మోక్షం లభించడం లేదు. ఫలితంగా పార్వతీపురం పట్టణవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. వర్షం పడితే చాలు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. శివారు ప్రాంతవాసులైతే రోజుల తరబడి వరదనీటిలోనే ఉండాల్సిన దుస్థితి. వర్షాకాలం, తుపాన్ల సమయంలో ఏటా ‘పుర’ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వరదనీటి మళ్లింపునకు అధికారులు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోవడంపై పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. కాగా కొద్దిరోజుల్లో కొలువు దీరనున్న నూతన మున్సిపల్‌ పాలకవర్గంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఏర్పడి నాలుగేళ్లు అవుతుంది. గ్రేడ్‌ -2 మున్సిపాల్టీ నుంచి గ్రేట్‌-1గా రూపాంతరం చెంది 25 ఏళ్లు అవుతుంది. అయితే పార్వతీపురంలో మురుగు, వర్షపు నీటిని మళ్లించేందుకు సరైన కాలువల నిర్మాణం జరగడం లేదు. 30 ఏళ్ల కిందట నిర్మించిన కాలువల్లో అనేక సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయి. నాటి అధికారులు, పాలకుల నిర్లక్ష్యం.. పుర ప్రజలకు శాపంగా మరింది. వర్షం పడిందంటే చాలు జిల్లాకేంద్రం ముంపునకు గురవుతోంది. మురుగుతో పాటు వర్షపునీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో 36 వార్డుల ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ప్రధాన రహదారితో పాటు వీధుల్లోనూ పాదచారులు, వాహనచోదకులు రాకపో కలు సాగించలేని పరిస్థితి. మురుగు, వర్షపునీరు రహదారులపై నుంచి ఇళ్లలోకి చేరుతుండడంతో పట్టణ నడిబొడ్డులో ఉన్న నిర్మల, శత్రుచర్ల రియల్‌ ఎస్టేట్‌ వీధి, గణేష్‌, పార్వతీనగర్‌ వాసులు ఏటా నరకం చూస్తున్నారు. దుర్వాసన, దోమల స్వైరవిహారంతో తరచూ రోగాలపాలవుతున్నారు.

2008లో భూగర్భ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు

మురుగు, వర్షపునీటి మళ్లింపునకు 2008లో పాలకవర్గం భూగర్భకాలువల నిర్మాణానికి తీర్మానం చేసింది. అప్పట్లో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు కూడా యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేసి.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మున్సిపల్‌ పరిపాలన శాఖకు పంపించింది. అయితే సాంకేతిక కారణాల ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు, పాలకవర్గాలు, ఇంజనీరింగ్‌ అధికారులు భూగర్భ కాలువల ఏర్పాటుపై శ్రద్ధ చూపలేదు. దీంతో గత కొన్నేళ్లుగా ప్రజలు వరదనీటితో నానా అవస్థలు పడుతున్నారు. మున్సిపల్‌ నూతన పాలకవర్గం దీనిపై దృష్టి సారించి భూగర్భ కాలువల నిర్మాణానికి చొరవ చూపాలని ‘పుర’ వాసులు కోరుతున్నారు.

మళ్లింపునకు చర్యలు

పట్టణంలోని 36 వార్డుల్లో వర్షపు, మురుగునీటిని మళ్లించడానికి చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు కాలువల నిర్మాణానికి సంబంధించి నూతన పాలకవర్గంతో సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేస్తాం.

- బి. రామ్‌గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

Updated Date - Nov 16 , 2026 | 12:22 AM