15 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:56 PM
రామభద్రపురం మండలంలోని కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం మోటారు బైకులపై గంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి 15.750 కిలోలు స్వాధీనం చేసుకున్నామని బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నారాయణరావు తెలిపారు.
ఎనిమిది మంది అరెస్టు
రామభద్రపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రామభద్రపురం మండలంలోని కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం మోటారు బైకులపై గంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి 15.750 కిలోలు స్వాధీనం చేసుకున్నామని బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నారాయణరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ ఒడిశాలోని సుంకి నుంచి మూడు బైకుల ద్వారా గంజాయిని తరలి స్తుండగా ముందస్తు సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నామని చెప్పారు. రవాణా చేస్తున్న వారంతా ఆయా ప్రాంతాల్లో విక్రయాలు చేయడంతో పాటు వారు కూడా గంజాయికి అలవాడు పడి వినియోగిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. పొట్లాలు చేసి ఆయా గ్రామాల్లో యువతకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా చాకలివీధికి చెందిన చీపు రుపల్లి కనకరాజు (ప్రేమ్‌కుమార్), చీపురుపల్లికి చెందిన సాకేటి రామూ సోనీకుమార్, పాలవలస శివకుమార్, బత్తిన నితీష్‌కుమార్, రాజాంకు చెందిన ఎస్.సాయికుమార్, వంగరకు చెందిన గాడి ప్రదీప్, మన్యం సాలూరుకు చెందిన మేడిశెట్టి మణి, పెదపాలు అజయ్‌లు అరెస్టయ్యారని చెప్పారు. వీరికాకుండా మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ మేరకు గంజాయితోపాటు మూడు బైకులు, రూ.1600 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శనివారం రిమాండ్ నిమిత్తం సాలూరు కోర్టుకు తరలించామని తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు, ఏఎస్‌ఐ కె.అప్పారావు, పోలీసులు పాల్గొన్నారు.