15 Fall Ill జీలుగు కల్లు తాగి 15 మందికి అస్వస్థత
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:59 PM
15 Fall Ill After Consuming Illicit Toddy గిరిశిఖర గ్రామం వనకాబడిలో జీలుగు కల్లు తాగి 15 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించడంతో కురుపాం ఆసుపత్రికి తరలించారు.
గిరిజనులకు తప్పని డోలీ మోత
గుమ్మలక్ష్మీపురం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామం వనకాబడిలో జీలుగు కల్లు తాగి 15 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించడంతో కురుపాం ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. వనకాబడి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు రోజూలానే శుక్రవారం సాయంత్రం జీలుగు కల్లు తాగారు. అర్ధరాత్రి నుంచి వారిలో కొంతమంది వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. శనివారం ఉదయానికి పదకొండు మంది పరిస్థితి మెరుగుపడింది. కాగా నలుగురి ఆరోగ్యం కుదటపడలేదు. గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేనుందున కుటుంబ సభ్యులు.. ఆ నలుగురికి డోలీ కట్టారు. మూడు కిలోమీటర్ల కాలి నడకన కొండ దిగి.. రాళ్లు రప్పలు దాటి దేరువాడ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటో ద్వారా కురుపాం సీహెచ్‌సీకి వెళ్లారు. బాధితులు జి.భూషణరావు, జోగారావు, నీలకంఠం, రాంసింగ్‌ను వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని వైద్యాధికారి సందీప్ తెలిపారు. కల్తీ జీలుగు కల్లు తాగడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. ఇదిలా ఉండగా.. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.
నిలకడగా బాధితుల ఆరోగ్యం: కలెక్టర్
కురుపాం/గుమ్మలక్ష్మీపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జీలుగు కల్లు తాగి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించినట్టు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పందించి సంబంధిత వైద్య ఆరోగ్యశాఖాధికార ులకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. బాధితుల్లో జోగారావుకు రక్తపోటు అధికంగా ఉండడంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై దుడ్డుకల్లు పీహెచ్‌సీ వైద్య బృందం తక్షణమే స్పదించిందన్నారు. వనకాబడిలో గ్రామంలో అత్యవసర మెడికల్ క్యాంప్ నిర్వహించినట్టు చెప్పారు. గ్రామంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ప్రజలను అమ్రపత్తం చేయాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించినట్టు తెలియజేశారు.