14 years in prison in case of transportation of ganja గంజాయి రవాణా కేసులో 14 ఏళ్ల జైలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:12 AM
14 years in prison in case of transportation of ganja గంట్యాడ పోలీసు స్టేషన్‌లో 2017లో నమోదైన గంజాయి కేసులో తొమ్మిది మంది నిందితులకు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు.
గంజాయి రవాణా కేసులో
14 ఏళ్ల జైలు
తొమ్మిది మంది నిందితులకు శిక్ష ఖరారు
విజయనగరం క్రైం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గంట్యాడ పోలీసు స్టేషన్‌లో 2017లో నమోదైన గంజాయి కేసులో తొమ్మిది మంది నిందితులకు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గంజాయి రవాణాకు సంబంధించి గంట్యాడ పోలీసులకు 2017 ఆగస్టు 23న అందిన సమాచారంపై కోఠారుబిల్లి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బొడ్డవర నుంచి మూడు వాహనాలు (కార్లు)వేగంగా వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. 32 గోనే సంచులతో సుమారు 640 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఎస్‌ఐ పి.నారాయణరావు కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ డి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితులు ఏఎస్‌ఆర్ జిల్లా అరకు మండలం లోతేరు గ్రామానికి చెందిన పట్టాసి చంద్రశేఖర్, అదే జిల్లాకు చెందిన అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్, అదే జిల్లాకు చెందిన అరకు మండలం చోళేం గ్రామానికి చెందిన కొర్న మోషసు అలియాస్ అలి, అదే జిల్లా అరకు మండలం డుంబ్రిగూడ గ్రామానికి చెందిన మద్యగురు సింహాద్రి, విజయనగరం జిల్లా ఎస్‌కోట మండలం టి.బొడ్డవర గ్రామానికి చెందిన శోభా నాగరాజు, ఎఎస్‌ఆర్ జిల్లా డుంబ్రిగూడ మండలం పెద అంజోడ గ్రామానికి చెందిన పంగి సన్యాసిరావు, అదే జిల్లాకు చెందిన అనంతగిరి మండలం ఎగువబూడికి చెందిన జన్ని అప్పారావు, అదే జిల్లా అదే మండలం శివలింగాపురానికి చెందిన దుడ్డు వీరభద్రరాజు, విశాఖ జిల్లా పద్మనాభం మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మద్దుల శరత్‌లపై నేరారోపణలు రుజువుకావడంతో న్యాయాధికారి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించడంలో నిందితులు విఫలమైతే అదనంగా మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు. ఏఎస్‌ఆర్ జిల్లా అనంతగిరి మండలం తొకురు గ్రామానికి చెందిన గేదేల ధర్మతేజ కేసు విచారణ సమయంలో అనారోగ్యంతో మృతి చెందారని ఎస్పీ దామోదర్ తెలిపారు.