100 Teachers జిల్లా ఉత్తమ గురువులుగా 100 మంది ఎంపిక
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:36 AM
100 Teachers Selected as Best in the District ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వంద మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు
పార్వతీపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వంద మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో ఎస్‌జీటీలు 46, ఎస్‌ఏలు 31, సీహెస్‌హెచ్‌వీలు 9, జీఆర్-2 హెచ్‌ఎంలు 7, జూనియర్ లెక్చరర్లు 3, స్కౌట్/గైడ్ ఉపాధ్యాయులు 2, కేజీబీవీ ఎస్‌వో ఒకరు, పీజీటీ ఒకరు ఉన్నారు. ఎంపీపీ/జడ్పీపీ నుంచి 78 మంది, గిరిజన సంక్షేమం నుంచి 8 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఐదుగురు, మున్సిపల్ పాఠశాలల నుంచి ఐదుగురు టీచర్లు ఎంపికయ్యారు. పార్వ తీపురం, సాలూరు మండలాల నుంచి 13 మంది, బలిజిపేట, గరుగుబిల్లి, కొమరాడ, వీరఘట్టం నుంచి 9 మంది చొప్పున ఎంపికయ్యారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ లెక్చరర్‌గా ఉమాశంకర్
పార్వతీపురం రూరల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం ఎంఆర్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత లెక్చరర్‌గా పనిచేస్తున్న సీహెచ్ ఉమాశంకర్ రాష్ట్రస్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం అమరావతిలో సీఎం చంద్రబాబుచేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. 2013, ఫిబ్రవరి 5న అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గణిత లెక్చరర్‌గా ఉమాశంకర్ చేరారు. 2022, జనవరి 1న బదిలీపై ఎంఆర్‌నగరం పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు గణితంో బోధించంతో పాటు ఇన్‌చార్జి ఫిజికల్ డైరెక్టర్, జనరల్ సెక్షన్ హెడ్‌గా బాధ్యలు నిర్వహిస్తున్నారు. విజయనగరం ఎంఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం గీతం కళాశాలలో గణితంలో పీహెచ్‌డీ చేశారు. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం గరుగుబిల్లికి చెందిన ఉమాశంకర్ గణితశాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఉమాశంకర్ తెలిపారు.
నేడు జిల్లాలో వేడుకలు...
పార్వతీపురం మండలం నర్సిపురంలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలతో సత్కరించేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్, విద్యాశాఖాధికారులు, ఇతర శాఖల స్బింది, ఉపాధ్యాయులు పాల్గొనున్నారు.