శతశాతం అక్షరాస్యతే ధ్యేయం
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:06 PM
పార్వతీపురం మన్యం జిల్లాను శతశాతం అక్షరాస్యత వైపు తీసుకెళ్లడమే లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
ఫ విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
ఫ మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పాలకొండ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాను శతశాతం అక్షరాస్యత వైపు తీసుకెళ్లడమే లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నగర పంచాయతీలోని కోటదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకల్లో ఆయన మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అక్షరాంధ్రలో భాగంగా 2025-26లో 67,686 మందికి గాను 67,384 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది 83.91 శాతం అక్షరాస్యత సాధించామన్నారు. 2026-27లో 71,194 మంది లక్ష్యాన్ని పూర్తి చేస్తే అక్షరాస్యత 92 శాతానికి చేరుతుందని వెల్లడించారు. జిల్లాపై ఉన్న వెనుకబడిన ప్రాంతమనే ముద్రను తొలగించేందుకు అక్షరాంధ్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అభ్యాసకుల మొబైల్ ఫోన్లలో లూల్ యాప్‌ను ప్రారంభించారు. వంద రోజుల్లో సులభంగా ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని వివరించారు. వంద రోజులు తర్వాత తిరిగి వచ్చి వారి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తానన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, డీఈవో బ్రహ్మాజీ, మెప్మా పీడీ నాగభూషణరావు, తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి, అడల్ట్ ఎడ్యుకేషన్ ఏడీ టి.వైకుంఠరావు పాల్గొన్నారు.
‘లూల్’ను సమర్థవంతంగా అమలు చేయాలి..
జిల్లాలో విద్యా ప్రమాణాలను గణణీయంగా పెంచడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడమే తమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం డివిజన్ స్థాయిలో విద్యాశాఖాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించేలా, ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేలా లూల్ (లెర్న్ టుడే, లీడ్ టుమారో) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన బోధన చేపట్టి అభ్యసన ఫలితాలను మెరుగుపర్చాలని స్పష్టం చేశారు. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానాలు, విద్యా ప్రణాళిక అమలు తీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం లూల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.