100 Beds, But 200 Inpatients బెడ్లు 100.. ఇన్‌పేషెంట్లు 200 మంది
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:23 AM
100 Beds, But 200 Inpatients సీతంపేట ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. మహిళలు, జనరల్, చిన్నారుల వార్డులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా జ్వరపీడితులు ఎక్కువగా వస్తుండడంతో ఇన్‌పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న బెడ్లు అన్ని నిండిపోయాయి.
సీతంపేట ఏరియా ఆసుపత్రికి జ్వర పీడితులు
కొందరికి బెంచీలపై వైద్యసేవలు
సీతంపేట రూరల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. మహిళలు, జనరల్, చిన్నారుల వార్డులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా జ్వరపీడితులు ఎక్కువగా వస్తుండడంతో ఇన్‌పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న బెడ్లు అన్ని నిండిపోయాయి. గత రెండు రోజులుగా 200మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉండడంతో ఒక్కో బెడ్డుపై ఇద్దరు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. చిన్నపిల్లల వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ఉన్న వంద బెడ్లు చాలక వార్డుల బయట ఉన్న బెంచీలపై కూడా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. దీంతో పేషెంట్లతో వచ్చే సహాయకులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
గిరిజన విద్యార్థుల మరణాలపై డీఎంహెచ్‌వో ఆరా
జొనగ జగ్గడుగూడ, నౌగూడ గ్రామాల్లో సవర దివాకర్, ఎస్.పూర్ణచంద్రలు మలేరియాతో మృతి చెందినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో బుధవారం డీఎంహెచ్‌వో భాస్కరరావు సీతంపేట ఏజెన్సీలో పర్యటించారు. విద్యార్థుల మరణాలపై ఆరాతీశారు. తొలుత కుసిమి పీహెచ్‌సీలో జ్వరాల తీవ్రత, ఓపీ రికార్డులను పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో జరుగుతున్న వైద్యశిబిరాలు, యాంటీలార్వా ఆపరేషన్‌లు, ఐఆర్‌ఎస్ స్ర్పెయింగ్ వంటి వాటిపై వైద్య, మలేరియా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా గిరిజన విద్యార్థులు మలేరియాతో చనిపోలేదని ఆయన తెలిపారు. దివాకర్ జ్వరంతో బాధపడుతుండగా ఈనెల 11న ఆగ్రామంలో వైద్యసిబ్బంది నిర్వహించిన పరీక్షల్లో మలేరియా నెగిటివ్ వచ్చిందన్నారు. పాలకొండలోని ఓప్రైవేటు హాస్పిటల్, ఏరియా ఆసుపత్రిలో విద్యార్థికి నిర్వహించిన వైద్యపరీక్షల్లోనూ ఎక్కడ మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని చెప్పారు. పూర్ణచంద్ర కూడా మలేరియాతో మృతిచెందలేదని స్పష్టంచేశారు. వారు అక్యూట్ మెనిన్‌గటీస్ ఎన్‌సిఫాలోపతి (బ్రెయిన్‌లో ఇన్‌ఫెక్షన్) కారణంగా మృతిచెంది ఉంటారని డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి తెలిపారు. హెల్త్ అసిస్టెంట్లను హైరిస్క్ ఉన్న పీహెచ్‌సీలకు డెప్యుటేషన్‌పై పంపనున్నట్లు వెల్లడించారు. హెల్త్ అసిస్టెంట్లు ఇకపై నెలలో నాలుగుసార్లు తప్పకుండా పర్యవేక్షణ ఉంచాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. ఈ పరిశీలనలో పీవో కౌశిక్, డీఎంవో సత్యనారాయణ, వైద్య సిబ్బంది ఉన్నారు.