Pond invasion ‘చెర’వులు
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:27 AM
‘చెర’వులు చెరువులు.. నాగరికతకు ఆనవాళ్లు.. పంటలకు ఆధారాలు.. మనిషితో అవినాభావ బంధానికి తార్కాణాలు.. అటువంటి అపూర్వ ప్రకృతి వనరులు నేడు కనుమరుగవుతున్నాయి. సమాజ సంపదపై వ్యక్తుల కళ్లు పడి చిక్కి‘పోతున్నాయి’.. జిల్లాలో చాలా చెరువులు మాయమైపోగా ఉన్నవి కూడా కబ్జా కోరల్లో పేరుకే చెరువులు అన్నట్లు కనిపిస్తున్నాయి. సమీప సంవత్సరాల్లో అవి కూడా ఉండకపోవచ్చునని సగటు జిల్లా వాసులు ఆవేదన చెందుతున్నారు.
‘చెర’వులు
కబ్జాకు గురవుతున్న సహజ వనరులు
పంట పొలాలుగా మారిపోతున్న వైనం
గుట్టుగా చదునుచేస్తున్న ప్రబుద్ధులు
నేతల సహకారంపై అనుమానాలు
అధికారులు నోటీసులు ఇవ్వడంతో సరి
పీజీఆర్‌ఎస్‌లోనూ ఎన్నో ఫిర్యాదులు
చెరువులు.. నాగరికతకు ఆనవాళ్లు.. పంటలకు ఆధారాలు.. మనిషితో అవినాభావ బంధానికి తార్కాణాలు.. అటువంటి అపూర్వ ప్రకృతి వనరులు నేడు కనుమరుగవుతున్నాయి. సమాజ సంపదపై వ్యక్తుల కళ్లు పడి చిక్కి‘పోతున్నాయి’.. జిల్లాలో చాలా చెరువులు మాయమైపోగా ఉన్నవి కూడా కబ్జా కోరల్లో పేరుకే చెరువులు అన్నట్లు కనిపిస్తున్నాయి. సమీప సంవత్సరాల్లో అవి కూడా ఉండకపోవచ్చునని సగటు జిల్లా వాసులు ఆవేదన చెందుతున్నారు. శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం పంచాయతీలోని చెరువుల దుస్థితి ఇందుకు ఉదాహరణ. ఆ పంచాయతీలోని కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు చెరువులు ఉండేవి అని చెప్పుకొంటున్నారు.
ఎస్.కోట రూరల్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి):
ఆ పంచాయతీలో చెరువులు కనుమరుగవుతున్నాయంట.. ఆక్రమణదారులు మాయం చేస్తున్నారంట.. చదును చేసేసి పంట భూములుగా మార్చేస్తున్నారంట.. ఎస్.కోట మండలమంతా మారుమోగుతున్న ఆ పంచాయతీ పేరు కిల్తంపాలెం. ఇక్కడున్న చెరువుల్లో 95శాతం కబ్జాదారుల చేతుల్లో చిక్కిశల్యమవుతున్నాయి. రెండురోజుల కిందట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఈ పంచాయతీలో వున్న కరకటజోరు గ్రామంలో పర్యటించగా తమ గ్రామంలో వున్న స్వామినాయుడు చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైందని స్థానికులు విన్నవించారు. కాపుసోంపురం-2లో ఉన్న దాలెమ్మచెరువును స్థానికులు కొంతమంది ఆక్రమిస్తున్నారని రెండు రోజుల కిందట గ్రామస్థులు తహసీల్దార్, ఎంపీడీవో, ఏపీవోలకు ఫిర్యాదు చేశారు. చెరువును కాపాడాలని వేడుకున్నారు. కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో 30 చెరువులు ఉన్నాయి. కానీ అవి రికార్డుల్లోనే. నాలుగు చెరువులు పూర్తిగా కనిపించవు. వాటిలో అల్లంవాని చెరువును ఒక గ్రామంగా మార్చేశారు. ఆరు ఎకరాల 58సెంట్లు ఉండే ఈ చెరువు స్థానంలో ఇళ్లు, పంట భూములు ఉన్నాయి. రెండు ఎకరాల 88సెంట్లు ఉండే అమర్లబందను ఒక రైతు ఏకంగా పంటపొలంగా మార్చేశాడు. ఎన్నో సంవత్సరాల కిందటే ఈ తంతు జరిగిపోయింది. ఇక ఎర్రబంద అనేది మూడు ఎకరాల చెరువు. ఎప్పుడో పంటపొలంగా మారిపోయింది. ఈ పంచాయతీలో 19 చెరువులు పేరుకు ఉన్నా కబ్జాకోరల్లో చిక్కుకుని రూపు కోల్పోయాయి.
ఫ తాజాగా ఆ జాబితాలో దాలెమ్మబంద చేరింది. 8 ఎకరాల 58సెంట్లు వున్న ఈచెరువులో గ్రామానికి చెందిన కొంతమంది ఇవి చెరువులు కావని, తమ భూములు అని కబ్జాచేసి చదును చేసేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈవిషయంపై ఇప్పటికే అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. మూడు ఎకరాలపైనే ఆక్రమణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నోటీసులు ఇవ్వడంతో సరి
చెరువులను సంరక్షించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖలు ఎవరైన చెబితేనే స్పందిస్తున్నాయి. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు తహసీల్దార్, సిబ్బంది హడావుడి చేయడం.. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం.. ఆపై మరిచిపోవడం సర్వసాధారణంగా మారింది. కొన్నిసార్లు బోర్డులు పాతి వెళ్లిపోతున్నారు తప్ప చెరువుల ఆక్రమణలు తొలగడం లేదు. ఇక ఇరిగేషన్ అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో వారికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటోంది. తమకు సిబ్బంది కొరత అనే సాకుతోనూ తప్పించుకుంటున్నారు. ఇలా అధికారుల తీరుతో చెరువులు రానున్న కాలంలో ఉంటాయో లేదో తెలియని పరిస్థితి.
ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే..
ఎస్.కోట మండలంలో కిల్లంపాలెంతో పాటు ఇతర చోట్ల కూడా దశాబ్దాలుగా చెరువులు కనుమరుగవుతున్నాయి. స్థానిక అధికారులు చూస్తున్నా, నోటీసులు ఇస్తున్నా.. హెచ్చరిక బోర్డులు పెడుతున్నా కబ్జాలు ఆగడం లేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే ఈ పరిస్థితి కాస్త మెరుగు కావొచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.