It doesn't look like a 'minor' change!
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:21 AM
It doesn't look like a 'minor' jolt! జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేశాక ఆ పార్టీలో వరుసగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశీలకులు ఊహించినట్టే నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును పదవి నుంచి తప్పించారు.
‘చిన్న’కుదుపులా లేదు!
చిన్నశ్రీను గుడ్‌బై చెప్పాక వైసీపీలో అనూహ్య పరిణామాలు
మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిపై వేటు
నెల్లిమర్ల బాధ్యతల నుంచి తప్పించిన నాయకత్వం
బొత్స వెంటే నడుస్తానని ప్రకటించినా అనుమానంతో చర్య
ద్వితీయ శ్రేణి నాయకులకు కీలక నాయకుడి ఫోన్
విజయనగరం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):
జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేశాక ఆ పార్టీలో వరుసగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశీలకులు ఊహించినట్టే నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును పదవి నుంచి తప్పించారు. చిన్న శ్రీను పార్టీకి గుడ్‌బై చెప్పిన మరుసటి రోజే వైసీపీ అత్యవసరంగా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం సమావేశం జరగ్గా సాయంత్రానికి నెల్లిమర్ల నియోజకవర్గ బాధ్యతల నుంచి బడ్డుకొండను తప్పించడం సంచలనంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగుతానని.. చివరివరకూ బొత్స వెంట నడుస్తానని బడ్డుకొండ ప్రకటించినా కానీ ఆయనపై వేటు వేశారు. చిన్న శ్రీను వెంట నడుస్తారన్న సమాచారంతోనే బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
ఇకపై వేర్వేరు పార్టీల్లో
బొత్స కుటుంబంలో ఎవరు ఎటు అనేదానిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. రాష్ట్రంలో వైసీపీలో ఎవరికి సమస్య వచ్చినా బొత్స వైపు చూస్తారు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచే రాజకీయ చీలికలు మొదలయ్యాయి. అయితే ఎలాంటి సమస్య వచ్చినా ఆయన పరిష్కరించుకుంటారంటూ ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త కురసాల కన్నబాబు వ్యాఖ్యానించడం విశేషం. ఇది పక్కాగా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న పోరాటం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నశ్రీను పార్టీ నుంచి వెళ్లిపోయిన తరువాత బొత్స భావోద్వేగానికి గురైనట్టు కనిపిస్తున్నారు కానీ చిన్న శ్రీను నుంచి అటువంటి సాంకేతాలు లేవు. ఇంతవరకూ కుటుంబం కోసం భారాలు మోశానని.. ఇక నుంచి తన పిల్లల భవిష్యత్ చూడాల్సిన బాధ్యత ఉన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. ప్రస్తుతానికి బొత్స వెంట ఆయన ఇద్దరు పిల్లలు, సోదరుడు బొత్స అప్పలనరసయ్య మాత్రమే ఉన్నారు. మిగిలిన కుటుంబసభ్యులంతా చిన్న శ్రీను వెంట నడుస్తున్నట్టు తెలుస్తోంది.
బడ్డుకొండకు స్వేచ్ఛ
బడ్డుకొండ అప్పలనాయుడు తీవ్ర అంతర్మథనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన కేవలం చిన్న శ్రీనుకి బావ మాత్రమే కాదు. వియ్యంకుడు కూడా. చిన్న శ్రీను తన కుమార్తె సిరి సహస్రతో కలిసి టీడీపీలోకి వెళ్లిపోయారు. కానీ ఆమె మామ బడ్డుకొండ అప్పలనాయుడు, భర్త మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. దీంతో సోషల్ మీడియాలో భార్య టీడీపీ, భర్త వైసీపీ అంటూ ట్రోల్స్ నడిచాయి. అయితే ఇప్పటికే బడ్డుకొండ అప్పలనాయుడుపై వైసీపీ హైకమాండ్‌కు ఒక అభిప్రాయం ఉన్నట్టు ఆయనను ఇన్‌చార్జి పదవి నుంచి తొలగింపుతో అర్ధమైంది. దీంతో ఆయనకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అయ్యింది. ఆయన బావ చిన్న శ్రీనును అనుసరించే స్వతంత్రం లభించింది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను తప్పించి జడ్పీటీసీకి బాధ్యతలు కట్టబెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నేరుగా ఫోన్లలో కట్టడి..
జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు ఓ కీలక నేత నేరుగా ఫోన్లు చేస్తున్నారు. ‘మీకు నీను ఉన్నాను. మీరెవరు చిన్నశ్రీను వెంట వెళ్లకండి’ అంటూ ఆ నేత చెబుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలకు ఆ ముఖ్యనేత ఫోన్లుచేసి కట్టడి చేసే వ్యూహంలో ఉన్నారు. మరోవైపు చిన్నశ్రీను పార్టీకి గుడ్‌బై చెప్పడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా అధిష్టానం దృష్టిపెట్టినట్టు సమాచారం. చిన్న శ్రీను వెంట నడుస్తారని సమాచారం ఉన్నవారు, ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారికి బొత్సతో పాటు అధిష్టాన పెద్దలు నేరుగా ఫోన్లు చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయట. పార్టీని విడిచిపెట్టి వెళ్లొద్దు..సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన వారు సైతం అయిష్టంగానే కొనసాగుతామని చెబుతున్నట్టు సమాచారం. మొత్తానికైతే బడ్డుకొండ అప్పలనాయుడును బాధ్యతల నుంచి తప్పించడం చూస్తుంటే మాత్రం చిన్న శ్రీను వెంట వెళ్లేవారు భారీగానే ఉండనున్నట్టు స్పష్టమవుతోంది.
ఫ బొత్స సత్యన్నారాయణ, బొత్స అప్పలనర్శయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గంలోని మండలాల్లో కొంతమంది వైసీపీ నాయకులు చిన్నశీను ద్వారా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న అదిష్టానం, బొత్స వారిని వెళ్లకుండా ఆపేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.
మంత్రిని కలిసిన చిన్నశ్రీను
విజయనగరం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను టీడీపీలో ఇటీవల చేరిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడానికి చిన్నశ్రీను చేరిక ఎంతో దోహదపడుతుందన్నారు. కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించేలా ఆయన చేరిక కలిసివస్తుందన్నారు. అనంతరం ఇద్దరూ జిల్లా రాజకీయాలపై చర్చిం చారు. తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యక్రమాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశంతో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, తూర్పు కాపు చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, గజపతినగరం ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.