Share News

mahanadu josh ‘మహా’ సందడి

ABN , Publish Date - May 28 , 2026 | 12:39 AM

maha nadu ‘మహా’ సందడి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జిల్లాలో కార్యకర్తల కేరింతలతో మొదలైంది. ఎటు చూసినా పసుపు కండువాలు, టోపీలు ధరిస్తూ విజయసంకేతం చూపుతూ శ్రేణులు రోజంతా సందడి చేశాయి. పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు కూడా మహానాడు ప్రాంగణాల్లో ఆనందంగా గడిపారు. మధ్యాహ్నం భోజనం చేస్తూ వంటకాలు అదరహో అంటూ కితాబిచ్చారు.

mahanadu josh ‘మహా’ సందడి
మంగళగిరిలోని రాష్ట్ర స్థాయి మహానాడును స్ర్కీన్‌పై వీక్షిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

‘మహా’ సందడి

తెలుగు తమ్ముళ్లలో ఉరకలెత్తిన ఉత్సాహం

మహానాడు వేదికలకు బారులు

తొలిరోజు లక్ష మందికి పైగా హాజరు

తెలుగు మహిళల్లో జోష్‌

అధినేతను ఎల్‌ఈడీ స్ర్కీన్లపై చూస్తూ కేరింతలు

ఆహా.. ఏమి రుచి అనేలా వంటకాలు

విజయనగరం, మే 27 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జిల్లాలో కార్యకర్తల కేరింతలతో మొదలైంది. ఎటు చూసినా పసుపు కండువాలు, టోపీలు ధరిస్తూ విజయసంకేతం చూపుతూ శ్రేణులు రోజంతా సందడి చేశాయి. పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు కూడా మహానాడు ప్రాంగణాల్లో ఆనందంగా గడిపారు. మధ్యాహ్నం భోజనం చేస్తూ వంటకాలు అదరహో అంటూ కితాబిచ్చారు. తొలిరోజు అన్నిచోట్లా సభలు విజయవంతం అయ్యాయి. తొలిసారిగా హైబ్రిడ్‌ విధానంలో చేపట్టిన మహానాడు బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత ప్రతినిధులతో మొదలైన మహానాడును జిల్లాలోని 73 క్లస్టర్లతో అనుసంధానించారు. పూర్తి డిజిటల్‌ విధానంలో జరిగిన ఈ మహానాడులో జిల్లా నుంచి సుమారు లక్ష మంది వరకు పాల్గొన్నారు. అమరావతి వేదికపై 65 మంది వక్తలను ఎంపిక చేయగా అందులో గంట్యాడ శ్రీదేవి, కిమిడి నాగార్జున ఉండడం విశేషం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గజపతినగరం పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి నియోజకవర్గంలోని మహానాడు ప్రాంగణాలను సందర్శించారు. 2026 డిజిటల్‌ మహానాడు గుర్తుండిపోయేలా ప్రతి సదస్సు వద్దా సెల్ఫీపాయింట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ తీసుకున్న ఫొటోలను కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

కార్యకర్తలే టీడీపీకి అధినేతలు

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, మే 27(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అహర్నిశలూ పనిచేస్తూ పార్టీ బలో పేతానికి కృషిచేసిన కార్యకర్తలే టీడీపీకి అధినేతలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. హైబ్రిడ్‌ మహానాడులో భాగంగా బుధవారం మంత్రి ముందుగా స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌ విగ్రహనికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అనంతరం క్లస్టర్‌ ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉషా కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన సాధారణ కార్యకర్త గంట్యాడ శ్రీదేవిని పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా తీసుకుని మహానాడు రాష్ట్ర వేదికపై కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. ప్రపంచంలో ఏ పార్టీలోనూ కార్యకర్తకు ఇటువంటి గౌరవం దక్కదన్నారు. విదేశాల్లో ఉన్న తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. తన తాత, తండ్రి, బాబాయ్‌ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేశారని, అలాగే తనకూ సేవ చేసుకొనే అవకాశం కల్పించిన ప్రజలకు తోడుగా ఉంటానన్నారు. అనంతరం గంగచోళ్లపెంటలో క్లస్టర్‌ ఇన్‌చార్జి డాకి నారాయణప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రారంభమైన మహానాడు వేదికను పర్యవేక్షించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మై టీడీపీ యాప్‌తో ఎంతో ప్రయోజనం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

విజయనగరం రూరల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): మై టీడీపీ యాప్‌తో పార్టీకి, కార్యకర్తలకు మధ్య మరింత కనెక్టవిటీ పెరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున చెప్పారు. టీడీపీ అమరావతి కార్యాలయంలో బుధవారం మొదలైన రాష్ట్ర స్థాయి మహానాడులో మై టీడీపీ యాప్‌పై తీర్మానాన్ని నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాప్‌ వల్ల ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకూ ఎక్కడ ఏ కార్యకర్త ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ చూస్తున్నారన్నారు. అంతటి సాంకేతిక పరిజ్ఞానం కోసం ఐటీ రంగాన్ని తొలి నుంచి చంద్రబాబు ప్రోత్సహిస్తూ వచ్చారని, ఆ తరువాత ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్‌ కూడా ప్రోత్సహిస్తున్నా రన్నారు. ఈ కారణంగానే విశాఖకు గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ఐటీ సంస్థలు వచ్చాయని చెప్పారు. డీసీసీబీ అధ్యక్షుడిగా తనకు చంద్రబాబు అవకాశం కల్పించారని, సహకార రంగ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని చెప్పారు.

టీడీపీలో మహిళలకు సముచిత స్థానం

పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి

గజపతినగరం, మే27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నతంగా గౌరవిస్తోందని పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్‌ విధానంలో బుధవారం మొదలైన మహానాడు వేదికపై ఆమె మాట్లాడారు. మహిళలను గౌరవించి ఆత్మస్థైర్యం నింపే పార్టీ టీడీపీ అని చెప్పారు. తన లాంటి సామాన్య కార్యకర్తకు పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళ అంటే వ్యక్తి కాదని, కుటుంభానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తిని ఇచ్చే ఒక శక్తి అని నమ్మి, మహిళా సాధికారతను చేతల్లో చూపిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:39 AM