ఘనంగా వీఐటీ-ఏపీ స్నాతకోత్సవం
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:46 AM
వీఐటీ-ఏపీ యూనివర్సిటీ ఆరో స్నాతకోత్సవం శనివారం అమరావతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 86 మంది పీహెచ్‌డీ స్కాలర్లతో కలిపి మొత్తం 3,877 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు.
3,877 మంది విద్యార్థులకు పట్టాలు
31 మందికి బంగారు పతకాలు..
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వీఐటీ-ఏపీ యూనివర్సిటీ ఆరో స్నాతకోత్సవం శనివారం అమరావతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 86 మంది పీహెచ్‌డీ స్కాలర్లతో కలిపి మొత్తం 3,877 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 31 మందికి బంగారు పతకాలను అందజేశారు. వీఐటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ విశ్వనాథన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అకడమిక్ అలయన్సెస్ గ్రూప్ అధిపతి కేఎం సుసీంద్రన్ గౌరవ అథితిగా హాజరయ్యారు. విద్యార్థులనుద్దేశించి జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జ్ఞానాన్ని రాజ్యాంగ విలువల పరిరక్షణకు, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు.
డిగ్రీలు జ్ఞానాన్ని, అర్హతను మాత్రమే ఇస్తాయని.. ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వ్యక్తిత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. తరగతిలో సంపాదించిన జ్ఞానాన్ని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని సుసీంద్రన్ సూచించారు. క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో దేశ ప్రగతికి తోడ్పడాలని విద్యార్థులకు విశ్వనాథన్ పిలుపునిచ్చారు. వైస్ చాన్స్‌లర్ అరుళ్‌మొళివర్మన్ మాట్లాడుతూ.. 2026 బ్యాచ్ విద్యార్థుల ప్రతిభ పట్ల వర్సిటీ గర్వపడుతోందన్నారు. ఈ బ్యాచ్‌లో సగటున వార్షిక ప్యాకేజీ రూ.7 లక్షలు కాగా.. అత్యధిక ప్యాకేజీ 96.26 లక్షలుగా నమోదైందని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జగదీశ్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, డీన్ (అకడమిక్) మధుసూదన్‌రావు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు