Share News

పనుల కోసం జడ్పీటీసీల పట్టు

ABN , Publish Date - Jul 24 , 2026 | 01:21 AM

జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు మరో రెండు నెలల్లో (సెప్టెంబరు) ముగియనున్న నేపథ్యంలో తమ మండలాల్లో కొత్త పనులు మంజూరు చేయాలని అధికారులపై పలువురు జడ్పీటీసీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.

పనుల కోసం జడ్పీటీసీల పట్టు

సెప్టెంబరుతో ముగియనున్న పదవీకాలం

ఈలోగా మంజూరుచేయాలని ఒత్తిడి

ఆచితూచి వ్యవహరిస్తున్న అధికారులు

ప్రస్తుతం రోడ్లు, డ్రైన్లు వంటి వాటికి ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేమన్న పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌

తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన ప్రభుత్వం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు మరో రెండు నెలల్లో (సెప్టెంబరు) ముగియనున్న నేపథ్యంలో తమ మండలాల్లో కొత్త పనులు మంజూరు చేయాలని అధికారులపై పలువురు జడ్పీటీసీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పనులు ప్రారంభమైతే ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి పొందవచ్చునని భావిస్తున్నారు. మండలంలో చేపట్టవలసిన పనుల వివరాలను జిల్లా పరిషత్‌ అధికారులకు అందజేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

గత ఏడాది జడ్పీ సాధారణ నిధుల నుంచి జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలకు సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు కేటాయించారు. వీటిలో రోడ్లు, డ్రైన్లు, బోర్లు, నీటి పథకాల ఏర్పాటు, అతిథి గృహాల మరమ్మతు వంటివి ఉన్నాయి. అందులో 20 శాతం పనులు ఇంకా ప్రారంభించలేదు. మిగిలిన 80 శాతం పనులు దాదాపు పూర్తిచేశారు. అయితే ప్రభుత్వం సాధారణ నిధుల కింద రూ.ఏడు కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ సమస్య రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉంది. ప్రస్తుతం పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుతో పాటు కొత్త పనుల మంజూరు చేయాలని అధికారులను జడ్పీటీసీ సభ్యులు కోరుతున్నారు. అయితే జిల్లా పరిషత్‌ ఖాతాలో ఉన్న నిధుల మేరకు పనులు మంజూరుచేసుకోవాలే తప్ప అదనంగా చేస్తే చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణ చైతన్య హెచ్చరించారు. ఇదే విషయం గత వారం అమరావతిలో జరిగిన సీఈవోల సమావేశంలో కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదిస్తున్న పనుల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జడ్పీటీసీ సభ్యుల కంటే ముందు ఎమ్మెల్యేలు సూచించిన పనులు చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధుల నుంచి పనులు ప్రతిపాదించాలని పలువురు జడ్పీటీసీ సభ్యులు యోచిస్తున్నారు. అయితే ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో రోడ్లు, డ్రైన్లు, అతిథిగృహల మరమ్మతుల కంటే తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. తాగునీటి అవసరాలు అంటే ఇప్పటికే ఉన్న నీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు నిధులు వెచ్చించనున్నారు. దీంతో రోడ్లు, డ్రైన్లు వంటి పథకాలకు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేమని పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనులు సెప్టెంబరు తరువాతే మంజూరుచేసే అవకాశం ఉందని వివరించారు.

Updated Date - Jul 24 , 2026 | 01:21 AM