జడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:46 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ టి.నిషాంతి బుధవారం గెజిట్ను విడుదల చేశారు. జిల్లాలో 90 శాతం పైబడి గిరిజనులుండడంతో పాటు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్డ్ ప్రాంతం కావడంతో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గిరిజనులకే రిజర్వు చేయాలనే నిబంధనను పాటిస్తూ పదకొండు మండలాల్లోని జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను ఎస్టీలకు రిజర్వు చేశారు. అలాగే స్థానిక ఎన్నికల నిబంధనల మేరకు సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ లెక్కన 11 జడ్పీటీసీ స్థానాల్లో 6 మహిళలకు, 11 ఎంపీపీలకు 5 మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మండల స్థాయి పదవుల్లో సగం మంది మహిళలే ఉంటారు.
- షెడ్యూల్డ్ ప్రాంతం కావడంతో అన్ని స్థానాలు ఎస్టీలకే
- 11 మండలాల్లో 6 జడ్పీటీసీ, 5 ఎంపీపీలు మహిళలకు...
పాడేరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ టి.నిషాంతి బుధవారం గెజిట్ను విడుదల చేశారు. జిల్లాలో 90 శాతం పైబడి గిరిజనులుండడంతో పాటు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్డ్ ప్రాంతం కావడంతో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గిరిజనులకే రిజర్వు చేయాలనే నిబంధనను పాటిస్తూ పదకొండు మండలాల్లోని జడ్పీటీసీ, ఎంపీపీ పదవులను ఎస్టీలకు రిజర్వు చేశారు. అలాగే స్థానిక ఎన్నికల నిబంధనల మేరకు సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ లెక్కన 11 జడ్పీటీసీ స్థానాల్లో 6 మహిళలకు, 11 ఎంపీపీలకు 5 మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మండల స్థాయి పదవుల్లో సగం మంది మహిళలే ఉంటారు.
జోరందుకోనున్న అభ్యర్థుల ఎంపిక
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జోరందుకోనుంది. ఇన్నాళ్లూ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న రాజకీయ పార్టీలు స్థానాల రిజర్వేషన్ కోసం ఎదురు చూశాయి. ఎట్టకేలకు ఆ ప్రక్రియ పూర్తి కావడంతో అందరి దృష్టి అభ్యర్థుల ఎంపికపై పడింది. దీంతో రిజర్వేషన్ల ఆధారంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలో దింపాలని అధికార, విపక్షాలు భావిస్తున్నాయి. దీంతో ఇదే అదనుగా జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు సైతం పోటీ భారీగా పెరగనుంది.
జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై గురి
జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రిజర్వేషన్ సైతం ఖరారు కావడంతో జడ్పీ పీఠంపై మన్యంలోని అధికార, విపక్ష పార్టీలు గురి పెట్టాయి. దీంతో పార్టీలతో పాటు మండలాల్లో సైతం తాము జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆశ అన్ని పార్టీల నేతల్లోనూ ఆశ బలంగా ఉంది. ఇన్నాళ్లుగా ఏజెన్సీలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పరిషత్ పీఠంపైనా అధికంగా ఆశలు పెట్టుకుంటున్నారు. అలాగే ఆయా పార్టీల అధిష్ఠానాలు సైతం ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతోనే తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నాయి.
అమల్లోకి ఎన్నికల కోడ్
రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) తక్షణమే అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఉన్న రాజకీయ పార్టీలు/ నాయకుల ఫ్లెక్సీలు, పోస్టర్లు, బోర్డులను వెంటనే తొలగిస్తారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. ఇప్పటికే ప్రారంభించిన పనులు, అమలు చేస్తున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఆయా పనులు, పథకాలను యథావిధిగా కొనసాగించవచ్చు.
జిల్లాలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పదవుల రిజర్వేషన్ వివరాలు
వ.సం మండలం పేరు జడ్పీటీసీ స్థానం ఎంపీపీ
1. అనంతగిరి ఎస్టీ(మహిళ) ఎస్టీ
2. అరకులోయలో ఎస్టీ ఎస్టీ
3. చింతపల్లి ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)
4. డుంబ్రిగుడ ఎస్టీ ఎస్టీ
5. జి.మాడుగుల ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)
6. జీకేవీఽధి ఎస్టీ ఎస్టీ
7. హుకుంపేట ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)
8. ముంచంగిపుట్టు ఎస్టీ ఎస్టీ
9. పాడేరు ఎస్టీ ఎస్టీ
10. పెదబయలు ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)
11. కొయ్యూరు ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)