Share News

ఆస్తుల పరిరక్షణపై జడ్పీ దృష్టి

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:11 AM

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్‌ ఆస్తుల పరిరక్షణకు అధికారులు నడుం బిగించారు.

ఆస్తుల పరిరక్షణపై  జడ్పీ దృష్టి

ఆక్రమణల బెడద నుంచి రక్షణకు చర్యలు

రీ సర్వే రికార్డుల్లో జడ్పీ పేరుతో నమోదుకు యత్నం

మూడు జిల్లాల కలెక్టర్లకు సీఈవో లేఖ

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్‌ ఆస్తుల పరిరక్షణకు అధికారులు నడుం బిగించారు. మండల, డివిజన్‌ కేంద్రాలు, ప్రముఖ కూడళ్లలోని ఆస్తుల రక్షణకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. విశాఖ నగరంలోని ఆస్తులను పూర్తిగా సద్వినియోగం చేయడంతోపాటు వాటికి ప్రహరీగోడలు నిర్మించనున్నారు. కొన్నిచోట్ల ఉన్నత పాఠశాలల ఏర్పాటుకు పూర్వం స్థలాలను విరాళంగా ఇచ్చిన వారి వారసులమంటూ ఇప్పుడు కొందరు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. దీంతో ఆయా స్థలాల పరిరక్షణకు న్యాయసలహా తీసుకుంటున్నారు. భూముల రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలు, అతిథిగృహాలు, ఇతర ఆస్తులను జడ్పీ పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయాలని కోరుతూ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లకు జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఇటీవల లేఖ రాశారు.

ఉమ్మడి జిల్లాలో 240 వరకు జడ్పీ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్‌ కార్యాలయాల పరిధిలో ప్రాథమిక, యూపీ పాఠశాలలు ఉన్నాయి. అధికశాతం పాఠశాలలను ప్రభుత్వ స్థలాల్లో నెలకొల్పారు. కొన్నిచోట్ల స్థానికంగా దాతలు ఇచ్చిన భూముల్లో ఏర్పాటుచేశారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలల స్థలాలకు ఇబ్బంది లేకపోయినప్పటికీ మండల కేంద్రాలు, బిజీ కూడళ్ల వద్ద వున్న పాఠశాలల ఆస్తుల రక్షణకు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి పాఠశాలకు గతంలో కేటాయించిన మేరకు ప్రస్తుతం స్థలం ఉందా? ఆక్రమణకు గురైందా? అన్న దానిపై పూర్తివివరాలు ఇవ్వాలని మండల పరిషత్‌ అధికారులు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు.

సింహాచలం గోశాల జంక్షన్‌లో శిథిలమైన జడ్పీ అతిథిగృహం స్థలం ఆక్రమణకు గురికాకుండా తాజాగా అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నారు. గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల స్థలాన్ని ఆక్రమించుకుని షాపింగ్‌మాల్‌ నిర్మించిన వ్యక్తిపై కోర్టులో వేసిన కేసు విచారణలో ఉంది. అదేప్రాంతంలో మరికొంత స్థలం ఆక్రమణకు గురికాకుండా క్రీడాశాఖకు అప్పగించారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు ఉన్నత పాఠశాలకు గతంలో భూమి ఇచ్చిన దాతల వారసులు ఇప్పుడు ఆ భూమి తమదంటూ వాదిస్తున్నారు. దీనిపై జడ్పీ యాజమాన్యం న్యాయపోరాటం చేస్తున్నది. అనకాపల్లి పట్టణ శివారులోని కొత్తూరులో జిల్లా పరిషత్తుకు చెందిన భూమిని చాలాకాలం క్రితం స్థానికులు ఆక్రమించుకొని ఇళ్ల నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంపై మరికొందరు కన్నేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై మిగిలిన భూమిని ఆటస్థలంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కె.కోటపాడు ఉన్నత పాఠశాల స్థలం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి ముందే కొంతమేర స్థలం ఆక్రమణకు గురైందనే వాదన ఉంది. దేవరాపల్లి మండలంలో ఓ ఉన్నత పాఠశాల ఆస్తిని కొందరు తమదిగా క్లెయిమ్‌ చేస్తుండడంపై ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న ప్రాథమిక పాఠశాలల స్థలాలను స్థానికులు ఆక్రమించుకున్న ఘటనలు వున్నాయి. దీంతో అన్ని ఉన్నత పాఠశాలకు ప్రహరీగోడల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పలు సమావేశాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధికారులను ఆదేశించారు.

భద్రతకు వీలుగా...

ఇదిలావుండగా ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల జడ్పీ/ మండల పరిషత్‌ పాఠశాలలు రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠాలుగా నమోదైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జరుగుతున్న భూముల రీసర్వే సందర్భంగా ఈ ఆస్తులను రెవెన్యూ రికార్డుల్లో జడ్పీ/మండల పరిషత్‌ పేర్లతో నమోదుచేయాలని మూడు జిల్లాల కలెక్టర్లను జడ్పీ సీఈవో కోరుతూ లేఖలు రాశారు. రీసర్వేలో భాగంగా 1(బీ), ఫెయిర్‌ అడంగల్‌లో గ్రామ కంఠం కాకుండా జడ్పీ/ మండల పరిషత్‌ పేరున నమోదుచేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మండల పరిషత్‌ అధికారులు ఆయా మండలాల్లోని తహశీల్దార్లను కలిసి జడ్పీ, మండల పరిషత్‌ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాలని ఆదేశించినట్టు జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. రీసర్వేలో జడ్పీ/మండల పరిషత్‌ పేర్లు నమోదుచేసేలా చూడాలని సూచించామన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:11 AM