16న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:48 AM
జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 16వ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుంచి నిర్వహిస్తున్నట్టు సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 16వ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుంచి నిర్వహిస్తున్నట్టు సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో నాలుగు స్థాయీ సమావేశాలు, మిగిలిన మూడు స్థాయీ సంఘ సమావేశాలు ఆయా చైర్‌పర్సన్ల అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరుగుతాయన్నారు. స్థాయీ సంఘ సమావేశాలకు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ప్రగతి నివేదికలతో అఽధికారులు హాజరుకావాలని కోరారు.
ట్రిఫుల్ ఐటీల్లో 90 మందికి సీట్లు
19వ తేదీ నుంచి కౌన్సెలింగ్
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలోని నాలుగు ట్రిఫుల్ ఐటీలకు విశాఖ జిల్లా నుంచి 90 మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు మాత్రమే త్రిపుల్ ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 35 మందికి, శ్రీకాకుళంలో 43 మందికి, ఇడుపులపాయ ఆర్కేవ్యాలీలో ఐదుగురికి, ఒంగోలు త్రిఫుల్ ఐటీలో ఏడుగురికి సీట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్లపాటు ఉచితంగా పూర్తిస్థాయి రెసిడెన్సియల్ విధానంలో తరగతులు నిర్వహించే త్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈనెల 19వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కాగా త్రిఫుల్ ఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ అభినందించారు.
కేజీహెచ్‌లో పీజీ విద్యార్థినులకు వేధింపులు
జనరల్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యుడి నోటి దురుసు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని కేజీహెచ్‌లో జనరల్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యుడు ఒకరు పీజీ విద్యార్థినులను వేధిస్తున్నారు. ఆయనకు నోటి దురుసు చాలా ఎక్కువని...గతంలో ఒకసారి జూనియర్ వైద్యుల సంఘానికి చెందిన నాయకుల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని విద్యార్థినులు చెబుతున్నారు. దాంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఆయన...మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నారంటున్నారు. ఈ విషయమై కళాశాల కంప్లయిట్ బాక్స్‌లో ఫిర్యాదు పత్రాన్ని వేసినట్టు తెలిపారు. ఇకపోతే, సదరు వైద్యుడు వార్డుల్లో పనిచేసే నర్సింగ్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తుంటారని అంటున్నారు. గతంలో నగర పరిధిలోని మరో ఆస్పత్రిలో పనిచేసిన సమయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారంటున్నారు. ఈ విషయాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి దృష్టికి తీసుకువెళ్లగా సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య విద్యార్థినులు వచ్చి సమస్యను చెప్పుకోవచ్చునని, రహస్యంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
15 నుంచి ఏయూ పీజీ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్టు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. పరీక్షలు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షల భవనంలో నిర్వహిస్తామన్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారం కోసం ఏయూ వెబ్‌సైట్ ఠీఠీఠీ.్చఠఛి్ఛౌౌుఽజూజీుఽ్ఛ.ఛిౌఝ ను చూడాలన్నారు. బీఆర్క్, బీటెక్, ఎంటెక్, ఎంప్లానింగ్, ఎం.ఫార్మసీ, ఎంఏ (అన్ని గ్రూపులు), ఎంకామ్, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంబీఏ (బీఎఫ్‌ఎస్), ఎంబీఏ (ఎఫ్‌టీ), బీబీఏ-ఎంబీఏ (ఐదేళ్ల సమీకృత కోర్సు), ఎంబీఏ (సిబ్), బి.ఫార్మసీ, ఫార్మా డి, ఎమ్మెస్సీ (అన్ని సబ్జెక్టులు), ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు, ఐదేళ్లు కోర్సులు), ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ, ఎంఈడీ, స్పెషల్ బీఈడీ, డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ఈ ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.