Share News

రెండో స్థానానికి చంద్రంపాలెం పాఠశాల!

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:58 AM

ఇప్పటివరకూ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులున్న పాఠశాలగా గుర్తింపుపొందిన చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రస్తుతం రెండో స్థానానికి పరిమితమైంది.

రెండో స్థానానికి చంద్రంపాలెం పాఠశాల!

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2,904 మంది విద్యార్థులు

3,250 మందితో ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల ఉన్నత పాఠశాల

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

ఇప్పటివరకూ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులున్న పాఠశాలగా గుర్తింపుపొందిన చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రస్తుతం రెండో స్థానానికి పరిమితమైంది. చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2,904 మంది విద్యార్థులు ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల ఉన్నత పాఠశాలలో 3,250 మందితో ప్రథమ స్థానంలో నిలిచింది.

రాష్ట్ర విభజన తరువాత ఎక్కువమంది పిల్లలున్న పాఠశాలగా చంద్రంపాలెం పాఠశాల గుర్తింపుపొందింది. 2014 నుంచి 2019 వరకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉండడంతో ఈ పాఠశాలకు ప్రాధాన్యం లభించింది. సీఎం హోదాలో చంద్రబాబునాయుడు పాఠశాలను సందర్శించారు. రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఒకసారి పాఠశాలను సందర్శించారు. ప్రత్యేకంగా కంప్యూటర్‌ లేబొరేటరీలు, ఇతర సదుపాయాలు కల్పించారు. దివీస్‌ లేబొరేటరీస్‌ పాఠశాల మైదానం అభివృద్ధికి భారీగా నిధులు ఇచ్చింది. ఒకానొక దశలో విద్యార్థుల సంఖ్య నాలుగు వేలు దాటింది. అయితే బక్కన్నపాలెం యూపీ పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ కావడం, సునీల్‌శర్మ కాలనీలో ఉన్నత పాఠశాలలో వసతులు మెరుగవ్వడంతో ఆయా ప్రాంతాల విద్యార్థులు అక్కడ చేరారు. దాంతోపాటు గడచిన కొద్దికాలంగా పాఠశాలలో హెచ్‌ఎం, ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేకపోవడం విద్యార్థుల చేరికలపై ప్రభావం చూపింది. కాగా చంద్రంపాలెం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటరావు దీర్ఘకాల సెలవు ముగించుకుని రెండు రోజుల క్రితం విధుల్లో చేరారు. రెండు నెలల క్రితం హెచ్‌ఎం, టీచర్ల మధ్య నెలకొన్న వివాదంపై డిప్యూటీ డీఈవో విచారణ నిర్వహించి నివేదికను పాఠశాల విద్యాశాఖకు పంపారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.


ప్రయాగరాజ్‌-విశాఖ మధ్య ప్రత్యేక రైలు

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

రవాణా ఆధారిత అభివృద్ధిలో భాగంగా ప్రయాగరాజ్‌, విశాఖ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రయాగరాజ్‌-విశాఖపట్నం (04189) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 14 నుంచి నవంబరు 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ప్రయాగరాజ్‌లో బయలుదేరి మరుసటిరోజు (శనివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-ప్రయోగరాజ్‌ (04160) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 15 నుంచి నవంబరు 28 వరకు ప్రతి శనివారం సాయంత్రం 3.40 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు ప్రయాగరాజ్‌ చేరుతుంది.


ములగాడ తహశీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌వోపై దాడి

నలుగురు యువకులు అరెస్టు

మల్కాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

ములగాడ తహశీల్దార్‌ కార్యాలయంలో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్‌వో)పై నలుగురు యువకులు దాడి చేయడం కలకలం రేపింది. మల్కాపురం ప్రాంతానికి చెందిన రత్నం ఇటీవల మీ-సేవా కేంద్రం ద్వారా కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే శాఖాపరంగా అన్ని అంశాలను పరిశీలించిన మీదట సంబంధిత అధికారి ధ్రువీకరణ పత్రం మంజూరుచేయలేదు. దరఖాస్తును తిరస్కరించినట్టు రత్నం ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లడంతో అతడి తరపున ఆవిషయమై ప్రశ్నించేందుకు గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు సువ్వరి సురేష్‌, కర్రి సురేష్‌, సింగుపల్లి సాయి, దినేష్‌ అనేవారు శ్రీహరిపురం ఎంఐజీ క్వార్టర్స్‌లో ఉన్న తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. దరఖాస్తును ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. అందుకు సంబంధిత వీఆర్‌వో సత్యనారాయణ సమాధానం చెప్పుతుండగానే నలుగురు యువకులు ఆగ్రహంతో ఊగిపోతూ దాడిచేశారు. ఆ సమయంలో తహశీల్దార్‌ రమేష్‌నాయుడు వచ్చి నచ్చజెప్పాలని చూసినప్పటికీ వారు మరింత రెచ్చిపోయారు. ఈ మేరకు తహశీల్దార్‌ రమేష్‌నాయుడు, వీఆర్‌వో సత్యనారాయణ వేర్వేరుగా మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా...ఎస్‌ఐ శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి, బెదిరింపులకు పాల్పడినందుకు గాను బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 132, 221, రీడ్‌ విత్‌ 3 (5) కింద కేసు నమోదుచేశారు. ఈ కేసును మల్కాపురం సీఐ నరసింహరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:58 AM