Share News

పాడేరు కాఫీహౌస్‌లో జడ్పీ కార్యాలయం

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:41 AM

పాడేరు కాఫీ హౌస్‌లో జడ్పీ కార్యాలయం ఏర్పాటు కానుంది.

పాడేరు కాఫీహౌస్‌లో జడ్పీ కార్యాలయం
జడ్పీ కార్యాలయానికి ఎంపిక చేసిన కాఫీ హౌస్‌ ఇదే

వివిధ పనులకు రూ.20 లక్షలు మంజూరు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

పాడేరు కాఫీ హౌస్‌లో జడ్పీ కార్యాలయం ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ కార్యాలయాల ఏర్పాటులో భాగంగా స్థానిక కాఫీ హౌస్‌లోనే ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న కాఫీ హౌస్‌లోని మీటింగ్‌ హాల్‌, నాలుగు గదులను వినియోగించుకోవడంతోపాటు అదనంగా అవసరమైన వసతిని సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఆయా పనులు చేపట్టేందుకు జిల్లాపరిషత్‌ నుంచి రూ.20 లక్షలు విడుదలయ్యాయని ఉద్యోగులు అంటున్నారు. దీంతో అల్లూరి జిల్లాకు సంబంధించిన జడ్పీ కార్యాలయాన్ని కాఫీ హౌస్‌లో నిర్వహించేందుకు నిర్ణయం జరిగిపోయింది.

జిల్లా పరిషత్‌లో మన్యానిదిప్రత్యేక స్థానం

గత 25 ఏళ్లుగా విశాఖపట్నం జిల్లాపరిషత్‌లో మన్యానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 39 మండలాలుండగా.. వాటిలో 11 మండలాలు మన్యంలో ఉండడంతో గిరిజన జడ్పీటీసీ సభ్యుల మద్దతుతోనే ఎవరైనా జడ్పీ పీఠంపై అధ్యక్షుడి హోదాలో కూర్చొనేవారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జడ్పీ ఎన్నికలు అనగానే అన్ని పార్టీలు ఏజెన్సీ వైపే చూసేవి. దీంతో జిల్లా పరిషత్‌లో మన్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం సుస్థిరమైంది. ఇదిలా ఉండగా 2001లో జడ్పీ చైర్మన్‌ పదవి ఎస్‌టీ మహిళలకు రిజర్వు కావడంతో పాడేరు జడ్పీటీసీ సభ్యురాలు వంజంగి కాంతమ్మ(కాంగ్రెస్‌) చైర్‌పర్సన్‌ పీఠంపై కూర్చున్నారు. విశాఖ జిల్లాలో తొలి మహిళా జడ్పీ అధ్యక్షురాలుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే 2006లో రోలుగుంట జడ్పీటీసీ సభ్యుడు గొర్లె రామ్మూరినాయుడు (కాంగ్రెస్‌) చైర్‌పర్సన్‌ కాగా హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు సమిడ రవిశంకర్‌ వైస్‌ చైర్మన్‌కాగా, 2011లో లాలం భవానీ చైర్‌పర్సన్‌(టీడీపీ) కాగా.. కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు వైస్‌ చైర్మన్‌ అయ్యారు. అలాగే 2014లో మళ్లీ లాలం భవానీ చైర్‌పర్సన్‌ కాగా అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు కొట్యాడ అప్పారావు వైస్‌ చైర్మన్‌ అయ్యారు. 2021లో జడ్పీ పీఠం ఎస్‌టీ మహిళలకు రిజర్వు కావడంతో ముంచంగిపుట్టు జడ్పీటీసీ సభ్యురాలుగా గెలుపొందిన జల్లిపల్లి సుభద్ర చైర్‌పర్సన్‌ అయ్యారు. ఇలా.. గత 25 ఏళ్లుగా జడ్పీ చరిత్రను పరిశీలిస్తే.. మన్యం ప్రాంతానికి ఓ ప్రత్యేకత నెలకొంది. ఈ తరుణంలో ఇక నుంచి ఏజెన్సీకే ఒక జిల్లా పరిషత్‌ ఏర్పడంతో మన్యంలోని రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారనున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:41 AM