Share News

బీసీలకు...జడ్పీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:18 AM

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సీటును బీసీ జనరల్‌ (వెనుకబడిన తరగతులకు చెందిన పురుషులు లేదా మహిళలు ఎవరైనా పోటీ చేయవచ్చు)కు కేటాయించారు.

బీసీలకు...జడ్పీ

చైర్మన్‌ పదవి కోసం భారీగానే పోటీ

ఉన్నది నాలుగు మండలాలే

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సీటును బీసీ జనరల్‌ (వెనుకబడిన తరగతులకు చెందిన పురుషులు లేదా మహిళలు ఎవరైనా పోటీ చేయవచ్చు)కు కేటాయించారు. పునర్విభజన అనంతరం విశాఖ జిల్లాలో కేవలం నాలుగు (భీమిలి, ఆనందపురం, పెదుర్తి, పద్మనాభం) జడ్పీటీసీ స్థానాలే మిగిలాయి. వీటిలో మూడు భీమిలి నియోజకవర్గంలోనే ఉన్నాయి. భీమిలి స్థానాన్ని బీసీ మహిళకు, పెందుర్తిని బీసీ జనరల్‌, ఆనందపురం జనరల్‌, పద్మనాభం మహిళ (జనరల్‌)కు కేటాయించినట్టు తెలిసింది.

జడ్పీ చైర్మన్‌ పదవిని తెలుగుదేశం పార్టీ నుంచి పెందుర్తికి చెందిన రెడ్డి నారాయణరావు ఆశిస్తున్నారు. అదేవిధంగా గుర్రంపాలేనికి చెందిన సుఖవాసి అజయ్‌ కూడా పోటీ పడుతున్నారు. భీమిలి మండలంలో గాడు వెంకటప్పడు జెడ్పీ చైర్మన్‌ సీటు ఆశిస్తున్నారు. అయితే జడ్పీటీసీ స్థానాన్ని మహిళకు రిజర్వ్‌ చేస్తే తన భార్యను పోటీకి దించుతారని తెలిసింది. ఆనందపురం నుంచి కోరాడ రాజబాబు, బీఆర్‌బీ నాయుడు, తాట్రాజు అప్పారావు, గండ్రెడ్డి స్వామినాయుడు, బలిరెడ్డి ముత్యాలనాయుడు పోటీ పడుతున్నారు. పద్మనాభం మండలంలో కసిరెడ్డి దామోదర్‌ పోటీ చేస్తానని ముందే ప్రకటించారు. ఇప్పుడు జడ్పీటీసీ స్థానాన్ని మహిళకు కేటాయించే అవకాశం ఉండడంతో కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి దించే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా కోరాడ రమణ, ఈగల శ్రీరామ్మూర్తి, కాళ్ల నగేశ్‌కుమార్‌లు పోటీ పడుతున్నారు. వీరంతా వారి కుటుంబం నుంచి మహిళలనే పోటీకి దించాల్సి ఉంటుంది.

కూటమిలో ఎవరికి ఏ సీట్లో..

ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో ఎక్కడ ఎవరు పోటీ చేయాలనేది కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. పెందుర్తిలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఉండడంతో అక్కడ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఆ పార్టీకే ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భీమిలిలో జనసేన తరపున పంచకర్ల సందీప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా తన వర్గానికి ఏ సీటు అయినా కోరే అవకాశం ఉంది.

బీసీ మహిళకు అనకాపల్లి జడ్పీ

అనకాపల్లి జిల్లా పరిషత్‌ (జడ్పీ) మొట్టమొదటి చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ మైలవరపు తేజ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ లాలం భవానీ, కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమార్‌ సతీమణి, చీడికాడ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పి.సత్యవతి, దేవరాపల్లి మండలానికి చెందిన కిలపర్తి రాజేశ్వరి రేసులో ఉన్నారు. ఇక ప్రతిపక్ష వైసీపీ నుంచి అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి, సబ్బవరం జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొటాన రాము కోడలు డాక్టర్‌ సౌమ్య, మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ రేస్‌లో ఉన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 01:18 AM