జడ్పీ విభజన
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:37 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
మూడు జిల్లాలకు వేర్వేరుగా కార్యాలయాలు
ఇప్పటికే పనులు ప్రారంభం
ఉద్యోగులలో 60 శాతం అనకాపల్లి జిల్లాకు, 30 శాతం అల్లూరి జిల్లాకు,
పది శాతం విశాఖ జిల్లాకు కేటాయింపు
10న సీఈవోలతో విజయవాడలో కీలక సమావేశం
జిల్లా పరిషత్ కార్యాలయాల ఏర్పాటు తరువాతే జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అధికారులతో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ముందే కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు వచ్చే నెలాఖరుతో ముగియనున్నది. ఆ తరువాత కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఈనెల పదో తేదీన విజయవాడలో అన్ని జిల్లాల సీఈవోలతో సమావేశం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న భవనాలు, మండలాలు, ఉద్యోగులు ఇతర వివరాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుత జడ్పీ పాలక వర్గాల గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటే కొత్త జిల్లాల వారీగా జడ్పీలు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఎన్నికలు నిర్వహిస్తే పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయి.
గత ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటుచేశారు. అప్పటికే జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఒకసారి ఎన్నికైన పాలక వర్గాన్ని విడగొట్టి జిల్లాల వారీగా ఏర్పాటు చేసేందుకు పాలనాపరమైన అవరోధాలు ఉంటాయన్న కారణంగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఎన్నికైన పాలకవర్గాలనే కొనసాగించారు. జడ్పీ సమావేశానికి విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు హాజరవుతుంటారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటుచేయాల్సి ఉంది. విశాఖ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో నాలుగు మండలాలు, అనకాపల్లి జిల్లాలో 24, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని అనకాపల్లిలోని జడ్పీ అతిథి గృహం (పాత ఆర్డీవో కార్యాలయం)లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కార్యాలయం ఏర్పాటుకు అనుగుణంగా రూ.20 లక్షలతో చైర్మన్, సీఈవో ఛాంబర్లు ఏర్పాటుచేయడంతోపాటు ఇతర మరమ్మతులు చేపట్టారు. రెండో అంతస్థులో ప్రస్తుతం రెవెన్యూకు సంబంధించి భూసేకరణ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయాన్ని వేరేచోటకు తరలిస్తే అక్కడ జడ్పీకి సంబంధించి కొన్ని విభాగాలు ఏర్పాటుచేస్తారు. అక్కడే సమావేశ మందిరం నిర్మించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని పాడేరులోని కాఫీ హౌస్‌లో ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ఇందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇక, విశాఖ జిల్లాలో కేవలం నాలుగు గ్రామీణ మండలాలే ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్టం మేరకు నాలుగు మండలాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల నాలుగు మండలాలకు ఒక జడ్పీ కార్యాలయం అవసరం. విశాఖలో ఉన్న జడ్పీ భవనంలో కొంత భాగం కార్యాలయానికి వినియోగించి, మిగిలిన భవనాలను ఇతర శాఖలకు ఇచ్చే అవకాశం ఉంది. నగరంలో ఇతర ఆస్తులు కాపాడుకునే బాధ్యత ఇక్కడ జడ్పీ కార్యాలయానికి ఉంటుంది. ప్రస్తుతం జడ్పీలో ఎనిమిది సెక్షన్లు ఉండగా, అందులో నాలుగు సెక్షన్లు అనకాపల్లి, మూడు అల్లూరి జిల్లాకు తరలించి ఒకటి విశాఖలో కొనసాగించే అవకాశం ఉంది. ఉద్యోగులలో 60 శాతం అనకాపల్లి జిల్లాకు, 30 శాతం అల్లూరి జిల్లాకు, పది శాతం విశాఖకు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటైన తరువాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.