జడ్పీ విభజన
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:10 AM
కొత్త జిల్లాల ప్రాతిపదికగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు
ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం
మండలాల ఆధారంగా సిబ్బంది విభజన
అనకాపల్లి జడ్పీ అతిథిగృహంలో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు
పాడేరులో కార్యాలయం కేటాయించే బాధ్యత కలెక్టర్‌కు అప్పగింత
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):
కొత్త జిల్లాల ప్రాతిపదికగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల కాలపరిమితి ముగియనున్నది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికగా జడ్పీలు ఏర్పాటుచేసి ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా పరిషత్‌ల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు తీసుకుంది.
విశాఖ జిల్లాను 2022 ఏప్రిల్ మూడు జిల్లాలుగా విభజించారు. అయితే అప్పటికే జడ్పీకి పాలకవర్గం ఉంది. కొత్త జిల్లాల వారీగా పాలకవర్గాలను విభజించాలని భావించినా, అందుకు కేంద్రం అనుమతి అవసరం కావడంతో అప్పట్లో ముందుకు వెళ్లలేదు. అయితే పాలక వర్గాల కాలపరిమితి సెప్టెంబరు 23వ తేదీ ముగుస్తున్నందున జడ్పీల విభజన మరోమారు తెరపైకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వేర్వేరుగా జడ్పీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు తాజాగా ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయ పరిధిలోని మూడు జిల్లాల్లో 39 మండల పరిషత్ కార్యాలయాలు, 12 అతిథి గృహాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. మండలాలు, డివిజన్ కేంద్రాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగ కార్యాలయాలు, 300కు మించి జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే విశాఖలో నాలుగు, అనకాపల్లిలో 24, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. విశాఖ జడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం 70 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిని మండలాల సంఖ్యకు అనుగుణంగా మూడు జిల్లాలకు కేటాయించేలా ప్రతిపాదనల్లో పొందుపరిచారు. జడ్పీ కార్యాలయంలో మొత్తం ఎనిమిది సెక్షన్లు ఉండగా, వాటిలో నాలుగింటిని అనకాపల్లికి, విశాఖ, అల్లూరి జిల్లాలకు చెరో రెండు సెక్షన్లు కేటాయించారు. సిబ్బందిలో అనకాపల్లికి 31 మందిని, అల్లూరి జిల్లాకు 22, విశాఖ జిల్లాకు 17 మందికి కేటాయించారు.
ప్రతి జిల్లాకు ఒక జడ్పీ కార్యాలయం ఏర్పాటుచేస్తారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, సీఈవో, ఇతర సిబ్బంది ఉంటారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సిబ్బందిని ఆయా జిల్లాల్లో ఉన్న మండలాల సంఖ్య ప్రకారం విభజించారు. అనకాపల్లి పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. రెండస్థుల భవనంలో కింద ఫ్లోర్‌లో చైర్మన్, సీఈవో, పై అంతస్థులో సిబ్బంది పనిచేయడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జడ్పీకి ప్రత్యేకించి కార్యాలయం లేదు. అతిథిగృహం చిన్నది కావడంతో కార్యాలయ కేటాయింపు అధికారం కలెక్టర్‌కు అప్పగించారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్యాలయం, పరిసరాల్లో ఉన్న ఆస్తుల పరిరక్షణ, పాలన కోసం చైర్మన్, సీఈవో, కొంతమంది సిబ్బంది ఉంటారు.
నాలుగు మండలాలతో జడ్పీ కొనసాగేనా?
విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో కేవలం నాలుగు (ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి) మండలాలు మాత్రమే ఉన్నాయి. జిల్లాల వారీగా విభజన జరిగితే విశాఖ జిల్లాకు ఒక కార్యాలయం, చైర్మన్‌తో కూడిన పాలకవర్గం ఉండాలి. కేవలం నాలుగు మండలాలకు ఒక చైర్మన్, వైస్ చైర్మన్, సీఈవో, ఇతర సిబ్బంది అవసరమా?...అనే ప్రశ్న తలెత్తుంది. ఇదిలావుండగా నాలుగు గ్రామీణ మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనిని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాది. ఇదిలావుండగా కేవలం నాలుగు మండలాలకు ఒక జడ్పీ కార్యాలయం, పాలకవర్గం ఏర్పాటుచేయడం ఇబ్బందేనని పంచాయతీరాజ్ రిటైర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.